Murmu: దేశ శ్రామిక శక్తిలో మహిళల భాగస్వామ్యం పెరగాలి.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

by vinod kumar |   ( Updated:2025-03-08 16:18:40.0  )
Murmu: దేశ శ్రామిక శక్తిలో మహిళల భాగస్వామ్యం పెరగాలి.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
X

దిశ, నేషనల్ బ్యూరో: స్వావలంబన, ఆత్మగౌరవం, సాధికారత కలిగిన మహిళల బలంతో మాత్రమే అభివృద్ధి చెందిన భారతదేశాన్ని నిర్మించగలమని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (Droupadi Murmu) అభిప్రాయపడ్డారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం (Womens day) సందర్భంగా మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ‘నారీ శక్తిసే వికసిత్ భారత్’ (Nari Shakti Se Viksit Bharat) అనే అంశంపై ఢిల్లీలో శనివారం నిర్వహించిన కార్యక్రమంలో ముర్ము ప్రసంగించారు. ‘అభివృద్ధి చెందిన భారత్ సంకల్పమే మనందరి లక్ష్యం. ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా కృషి చేసి ఈ కలను నెరవేర్చాలి. మహిళలు తమ జీవితాల్లో పూర్తి విశ్వాసం, అంకితభావంతో ముందుకు సాగి సమాజ అభివృద్ధికి తోడ్పడాలి’ అని వ్యాఖ్యానించారు.

భారతదేశం ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించే దిశగా పయనిస్తున్నందున, దేశ శ్రామిక శక్తిలో మహిళల భాగస్వామ్యం వేగంగా పెరగాలని పిలుపునిచ్చారు. ప్రస్తుతం దేశంలో మహిళలు ఎదగడానికి మెరుగైన వాతావరణం ఉందని కొనియాడారు. మహిళల పట్ల గౌరవ భావన మాత్రమే భయం లేని సామాజిక వాతావరణాన్ని సృష్టిస్తుందని, అటువంటి పరిస్థితుల్లో అమ్మాయిలు పొందే ఆత్మవిశ్వాసం మన దేశాన్ని కొత్త శిఖరాలకు తీసుకెళుతుందని తెలిపారు. రాజ్యాంగ సభలో సభ్యులుగా ఉన్న సరోజిని నాయుడు, రాజకుమారి అమృత్ కౌర్, సుచేతా కృపాలానీ, హంసబెన్ మెహతా వంటి ప్రముఖుల సహకారాన్ని ఎప్పటికీ మర్చిపోలేమన్నారు. ఈ కార్యక్రమంలో మహిళా శిశు అభివృద్ధి శాఖ మంత్రి అన్నపూర్ణ దేవి, సహాయ మంత్రి సావిత్రి ఠాకూర్ పాల్గొన్నారు.

Read More ....

Mahila Samridhi Yojana : మహిళా దినోత్సవం వేళ ఢిల్లీ మహిళలకు గుడ్ న్యూస్


Next Story