Mpox: భారత్‌లో మొదటి అనుమానాస్పద మంకీపాక్స్ కేసు నమోదు

by S Gopi |
Mpox: భారత్‌లో మొదటి అనుమానాస్పద మంకీపాక్స్ కేసు నమోదు
X

దిశ, నేషనల్ బ్యూరో: గత కొన్ని వారాలుగా వివిధ దేశాల్లో నమోదవుతున్న ప్రాణాంతక మంకీపాక్స్ వ్యాధి భారత్‌లోనూ వెలుగు చూసింది. తాజాగా దేశంలో తొలి అనుమానిత మంకీపాక్స్ కేసు నమోదైనట్టు ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. విదేశాల నుంచి వచ్చిన ఓ యువకుడిలో మంకీపాక్స్ లక్షణాలను వైద్యులు గుర్తించినట్టు, తక్షణం ఆ వ్యక్తిని ఐసోలేషన్‌కు పంపినట్టు వెల్లడించింది. ప్రస్తుతం అతని ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్టు గుర్తించారు. ఎంపాక్స్ వైరస్‌కు సంబంధించిన నిర్ధారణ కోసం వ్యక్తి నమూనాలను సేకరించి పరీక్షలకు పంపించారు. ఇప్పటికే పలు దేశాల్లో ఎంపాక్స్ కేసులు నమోదైన నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అందుకు తగిన చర్యలు ప్రారంభించింది. వ్యాధి సంక్రమణను నియంత్రించేందుకు కాంటాక్ట్ ట్రేసింగ్ జరుగుతోంది. వ్యాధి తీవ్రత విషయంలో ముందుగానే అంచనా వేసినట్టు, ఆందోళన చెందాల్సిన పనిలేదని నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ స్పష్టం చేసింది. ఇప్పటికే ప్రభుత్వం ఇలాంటి కేసులకు విషయంలో సమర్థవంతంగా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉందని, కేసుల నమోదు తీవ్రమైతే, తగ్గించడానికి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రిత్వ శాఖ ప్రకటనలో పేర్కొంది. కాగా, ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 18 వేలకు మించిన ఎంపాక్స్ అనుమానిత కేసులు నమోదవగా, 926 మంది మృతి చెందారు.

Advertisement

Next Story

Most Viewed