MK Stalin: గవర్నర్ తో విభేదాలు.. తమిళనాడు సర్కారు కీలక నిర్ణయం

by Shamantha N |
MK Stalin: గవర్నర్ తో విభేదాలు.. తమిళనాడు సర్కారు కీలక నిర్ణయం
X

దిశ, నేషనల్ బ్యూరో: తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవితో విభేదాల వేళ.. ఎంకే స్టాలిన్ (MK Stalin) సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర స్వయంప్రతిపత్తి (Tamil Nadu's autonomy)పై సూచనలకు కమిటీని ఏర్పాటుచేసింది. స్వయంప్రతిపత్తి కోసం తీసుకోవాల్సిన చర్యలను ఆ కమిటీ సిఫారసు చేయనుంది. సుప్రీంకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కురియన్ జోసెఫ్ నేతృత్వంలో ఈ ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేశారు. మాజీ ఉన్నతాధికారులు అశోక్ శెట్టి, నాగరాజన్ లు ఈ కమిటీలో సభ్యులుగా ఉండనున్నారు. భారతదేశ రాష్ట్రాల యూనియన్ సమగ్రతను ప్రభావితం చేకుండా చట్టాలను అంచనా వేసి మూల్యాంకనం చేయనుంది. ఉమ్మడి జాబితాకు తరలించిన తమిళనాడు రాష్ట్ర అంశాలను తిరిగి పొందేందుకు చర్యలను సిఫార్సు చేసే బాధ్యత కూడా ఈ కమిటీకి ఉంది. అంటే, ఒకప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలకు వదిలివేసిన పాలన విధాన రూపకల్పన రంగాలను తిరిగి ఇవ్వడం. కాగా.. ఈ కమిటీ జనవరి 2026 నాటికి తాత్కాలిక నివేదికను సమర్పించనుంది. 2028 నాటికి తుది నివేదిక సమర్పించనుంది. తమిమిళనాడు సహా అన్ని రాష్ట్రాల హక్కులను పరిరక్షించడమే లక్ష్యం అని తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ అన్నారు.

బిల్లులపై విభేదాలు

బిల్లుల ఆమోదంపై గవర్నర్‌, తమిళనాడు ప్రభుత్వం మధ్య విభేదాలు నెలకొన్నాయి. ఇటీవల సుప్రీంకోర్టు తీర్పుతో స్టాలిన్ ప్రభుత్వానికి ఊరట లభించింది. పెండింగులో పెట్టిన పది బిల్లులు గవర్నర్‌ ఆమోదం పొందినట్టే భావించాలని న్యాయస్థానం స్పష్టంచేసిన నేపథ్యంలో వాటికి చట్టబద్ధమైన హోదా కల్పిస్తూ ప్రభుత్వం గెజిట్ విడుదల చేసింది. ఈ పరిణామాల వేళ స్టాలిన్ సర్కారు నుంచి ఈ నిర్ణయం వెలువడింది.

Next Story