మార్చి 23న‌ 'షహీద్ దివస్‌' ఎందుకు పాటిస్తారు? అస‌లు, ఆ రోజు ఏంజ‌రిగింది..?!

by Sumithra |
మార్చి 23న‌ షహీద్ దివస్‌ ఎందుకు పాటిస్తారు? అస‌లు, ఆ రోజు ఏంజ‌రిగింది..?!
X

దిశ‌, వెబ్‌డెస్క్ః స‌మాజాన్ని స‌క్ర‌మంగా న‌డ‌ప‌డానికి ఏర్పాటు చేసుకున్న 'అధికారం' అవ‌ధులు దాటిన‌ప్పుడు, అన్యాయాన్ని పెంచి, పోషిస్తున్న‌ప్పుడు 'ప్ర‌జా పోరాటం' అనివార్య‌మ‌వుతుంది. అయితే, పోరాటం ఏదైనా అందులో కొన్ని విలువైన వాటిని పోగొట్టుకోక త‌ప్ప‌దు. అత్యంత‌ విలువైన వాటి కోసం కోల్పోయేవ‌న్నీ త్యాగంలో భాగ‌మే..! అలాగే, మ‌న భార‌త స్వాతంత్య్రం కోసం ఎంతో మంది త్యాగ‌ధ‌నులు త‌మ విలువైన ప్రాణాల‌ను త్యాగం చేశారు. దేశం కోసం తమ ప్రాణాలను త్యాగం చేసిన వారి శౌర్యాన్ని, నిబద్ధతను గౌరవిస్తూ జ్ఞాప‌కం చేసుకునేదే 'షహీద్ దివస్‌'గా పిలుచుకునే 'అమరవీరుల దినోత్సవం'.

1931 మార్చి 23న, భార‌త స్వాతంత్య్ర‌ సమరయోధులు భగత్ సింగ్, శివరామ్ రాజ్‌గురు, సుఖ్‌దేవ్ థాపర్‌లను నాటి బ్రిటిష్ పాలకులు ఉరితీశారు. వారి త్యాగాన్ని గుర్తుచేసుకుంటూ యావ‌త్ భార‌తం ష‌హీద్ దివ‌స్ జ‌రుపుకుంటుంది. అయితే, ఈ 'ష‌హీద్ దివస్' భారతదేశంలో మ‌రో సందర్భంలోనూ నిర్వ‌హిస్తారు. మార్చి 23తో పాటు, మహాత్మా గాంధీ హత్యకు గురైన రోజు, జనవరి 30న, కూడా షహీద్ దివస్‌గా పాటిస్తారు. ఈ రోజు, దేశ‌వ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజలు పోరాట‌ వీరులకు నివాళులర్పిస్తారు. దేశ గౌరవాన్ని నిలబెట్టడానికి, ప్ర‌జ‌ల‌ను రక్షించడానికి వారు చేసిన పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకుంటారు.

చరిత్ర, ప్రాముఖ్యత

భగత్ సింగ్, సుఖ్‌దేవ్, రాజ్‌గురు స్వాతంత్య్ర‌ పోరాటంలో చేరిన త‌ర్వాత బ్రిటీష్ సామ్రాజ్య‌వాదుల‌కు వెన్నులో వ‌ణుకుపుట్టింది. అప్ప‌టికే, స్వాతంత్రోద్య‌మాన్ని అతి క్రూరంగా అణిచివేస్తున్న బ్రిటీష్ పాల‌కులు ఎంతో మంది భార‌తీయ నాయ‌కుల‌ను చంపేశారు. ఇలా బ్రిటీష్ దాష్టికానికి బ‌లైన‌ లాలా లజప‌త్‌రాయ్ మరణానికి ప్రతీకారం తీర్చుకోవాలని ఈ ముగ్గురు వీరులు భావిస్తారు. ఈ యువ విప్లవకారుల తెగింపు బ్రిటీష్ అధికారుల‌కు ముచ్చెమ‌ట‌లు ప‌ట్టిస్తాయి. ఈ నేప‌థ్యంలో 1928లో బ్రిటిష్ పోలీసు అధికారి జాన్ సాండర్స్ హత్యతో సహా వివిధ ఆరోపణలపై ఈ ముగ్గురిని అరెస్టు చేస్తారు. అయితే, వీళ్లు జాన్ సాండర్స్‌ను చంపాలని అనుకోలేదు. ఓ నిర‌స‌న కార్య‌క్ర‌మంలో నిరసనకారులపై లాఠీఛార్జ్ చేయమని ఆదేశించిన‌ పోలీసు సూపరింటెండెంట్ జేమ్స్ స్కాట్‌ని చంప‌డ‌మే వారి ల‌క్ష్యం. ఎందుకంటే, ఈ లాఠీచార్జ్‌ లాలా లజపత్ రాయ్ మరణానికి దారితీసింది.

Advertisement

Next Story