మావోయిస్టుల పేలుడు పదార్థాల నిపుణుడు హతం

by Johnkora |
మావోయిస్టుల పేలుడు పదార్థాల నిపుణుడు హతం
X

- చత్తీస్‌గడ్‌లో హింసాత్మక సంఘటనలకు కీలక సూత్రధారిగా ఉన్న మహేశ్ కోర్సా

- 77 మంది మృతికి కారకుడని పోలీసుల వెల్లడి

దిశ, నేషనల్ బ్యూరో:

మావోయిస్టులకు పేలుడు పదార్థాలు తయారు చేసి ఇవ్వడంలో నిపుణుడైన మహేష్ కోర్సా (36)ఒక ఎన్‌కౌంటర్‌లో మృతి చెందాడు. చత్తీస్‌గడ్‌లోని సుక్మా జిల్లలాలో అహింసా కార్యాకలాపాలకు సూత్రధారిగా ఉన్న మహేశ్.. గత వారం జరిగిన ఒక ఎన్‌కౌంటర్‌లో మృతి చెందినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ ఎన్‌కౌంటర్‌లో మొత్తం ముగ్గురు మావోయిస్టులు మృతి చెందగా, అందులో మహేష్ కోర్సా కూడా ఉన్నట్లు పోలీసులు స్పష్టం చేశారు. 2017లో మావోయిస్టులు జరిపిన దాడిలో 25 మంది భద్రతా సిబ్బంది చనిపోయారు. 2020లో 17 మందిని, 2021లో 22 మందిని చంపిన ఘటనతో పాటు అనేక ఇతర అహింసా సంఘనటలకు మహేష్ కీలక పాత్రధారిగా ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.

బీజాపూర్ జిల్లా గంగ్లూర్‌లో జన్మించిన మహేష్ కోర్సా.. 2010లో సీపీఐ (మావోయిస్టు) పార్టీలో చేరాడు. 2017లో ఆయనకు ఐఈడీల తయారీలో ఒక నెల పాటు మావోయిస్టులు శిక్షణ ఇచ్చారని, అప్పటి నుంచి బస్తర్ ప్రాంతంలో ఐఈడీలను అమర్చడంలో మహేష్ నిష్ణాతుడిగా మారినట్లు పోలీసులు తెలిపారు. ఇతర ప్రాంతాల్లో ఉన్న మావోయిస్టులకు కూడా ఐఈడీల తయారీలోని మెలకువలను మహేష్ నేర్పించాడని చెప్పారు. మహేష్ కోరసా భార్య హేమ్లా మావోయిస్టు పార్టీలో డాక్టర్‌గా పని చేస్తున్నట్లు పోలీసులు వివరించారు. జగర్‌గుండా ప్రాంతంలో జరిగిన అనేక హింసాత్మక ఘటనకు మహేష్ కోర్సా మారుపేరుగా నిలిచాడని డిప్యూటీ ఐజీ కమ్లోచన్ కశ్యప్ వెల్లడించారు. గత ఏడాది డిసెంబర్ 28న పోలంపల్లి ప్రాంతంలో 40 కేజీల ఐఈడీని కోర్సా అమర్చాడు. ఈ బాంబు పేలినట్లయితే బీభత్సమైన నష్టం జరిగేది. కానీ భద్రతా దళాలు ఆ బాంబును కనుగొని, నిర్వీర్యం చేసినట్లు డీఐజీ పేర్కొన్నారు.

2015లో చింతగుఫా పోలీస్ స్టేషన్‌ పరిధిలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో తొలి సారిగా మహేష్ కోర్సా పేరు పోలీసు రికార్డుల్లోకి ఎక్కింది. ఆ ఎన్‌కౌంటర్‌లో ఏడుగురు స్పెషల్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు చనిపోగా, 10 మంది గాయపడ్డారు. అలాగే 25 మంది సీఆర్పీఎఫ్ జవాన్లను 2017లో దాడి చేసి చంపేసిన ఘటనలో కూడా కోర్సా పాత్ర ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. 2020లో బుర్కాపాల్ ప్రాంతంలో జరిగిన మరో ఎన్‌కౌంటర్‌లో 17 మంది జవాన్లు మృతికి మహేష్ కారకుడని పోలీసులు వెల్లడించారు. 2021లో 22 మంది జవాన్ల మృతికి, గత ఏడాది సుక్మాలోని టేకలగూడెం ప్రాంతలో ముగ్గురు జవాన్లు చనిపోవడానికి కారణమైన ఎన్‌కౌంటర్లలో మహేష్ కోర్సా కీలకంగా ఉన్నట్లు పోలీసులు స్పష్టం చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed