CM Mamata Banerjee : మమతా సమర్ధులైన నాయకురాలు : శరద్ పవార్ కీలక వ్యాఖ్యలు

by Y. Venkata Narasimha Reddy |   ( Updated:2024-12-08 11:56:26.0  )
CM Mamata Banerjee : మమతా సమర్ధులైన నాయకురాలు : శరద్ పవార్ కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్ : ప్రతిపక్ష కూటమి ‘ఇండియా’ కు నాయకత్వం వహిస్తానన్న తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి..పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ(CM Mamata Banerjee) వ్యాఖ్యలను నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎస్పీ) అధినేత శరద్ పవార్ (Sharad Pawar) స్వాగతించారు. మమతా బెనర్జీ సమర్థులైన నాయకురాలని(Capable leader)ప్రశంసించారు. శనివారం కొల్హాపూర్‌లో జరిగిన మీడియా సమావేశంలో శరద్ పవార్ మాట్లాడారు. ప్రతిపక్ష కూటమికి నాయకత్వం వహించే ఉద్దేశం, హక్కు మమతా బెనర్జీకి ఉన్నాయని చెప్పారు. ‘దేశంలోని సమర్థ నాయకురాలలో మమతా ఒకరని.. కూటమికి నాయకత్వం వహిస్తానని చెప్పే హక్కు ఆమెకు ఉందని స్పష్టం చేశారు. మమతా పార్లమెంటుకు పంపిన ఎంపీలు కష్టపడి పని చేయడంతోపాటు దేశ రాజకీయాలు, సమస్యల పట్ల అవగాహన కలిగి ఉన్నవారన్నారు.

ఇండియా కూటమికి సారధ్యం వహిస్తున్న కాంగ్రెస్ పార్టీ హర్యానా, జమ్ముకశ్మీర్‌, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయాలను ఎదుర్కొంది. దీంతో ప్రతిపక్షాల ‘ఇండియా’ కూటమికి కాంగ్రెస్‌ నాయకత్వం వహించడంపై పలు ప్రాంతీయ పార్టీలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో మమతా బెనర్జీ ‘ఇండియా’ కూటమికి నాయకత్వం వహించడానికి తాను సిద్ధమంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా కొనసాగుతునే.. ప్రతిపక్ష ఫ్రంట్‌ను నడిపే బాధ్యతను కూడా తాను నిర్వహించగలనని, ఇండియా కూటమిని ఏర్పాటు చేసింది తానేనని ఓ జాతీయ న్యూస్ చానల్ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. మమతకు కూటమిలోని సమాజ్ వాది, శివసేన(ఉద్దవ్) వర్గాలు మద్దతు తెలుపుతున్నాయి. కాంగ్రెస్, వామపక్షాలు మమతా వైఖరిపై ఆగ్రహంగా ఉన్నాయి.

Next Story

Most Viewed