Patriotism: లివింగ్ వాల్ మెమోరియల్.. శరీరంపై టాటూలతో యువకుడి వినూత్న దేశభక్తి

by Ramesh Goud |
Patriotism: లివింగ్ వాల్ మెమోరియల్.. శరీరంపై టాటూలతో యువకుడి వినూత్న దేశభక్తి
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ యువకుడు తన దేశభక్తిని వినూత్నంగా చాటుకున్నాడు. దేశం కోసం అమరులైన సైనికుల పేర్లను తన శరీరంపై పచ్చబొట్టుగా వేయించుకున్నాడు. ఇందులో 631 మంది సైనికుల పేర్లతో పాటు దేశం కోసం ప్రాణాలు అర్పించిన పలువురు స్వాతంత్ర సమరయోదుల చిత్రాలు కూడా ఉన్నాయి. హాపూర్ కు చెందిన అభిషేక్ గౌతమ్ అనే వ్యక్తి తన స్నేహితులతో లేహ్-లడఖ్ పర్యటనకు వెళ్లారు. అక్కడ జరిగిన ఓ సంఘటనలో తన స్నేహితుడిని ఇండియన్ డిఫెన్స్ రీసెర్చ్ వింగ్ రక్షించిందని, ఆ పర్యటన ముగిసే వరకు సైనికులు వారి వెంటే ఉండటంతో సురక్షితంగా ఉన్నామని గౌతమ్ చెప్పాడు. దీంతో అప్పటినుంచి తాను సైన్యంలో చేరలేకపోయిన సైనికుల కోసం ఏదో ఒకటి చేయాలని నిర్ణయించుకున్నాడు. దీంతో అతనికి టాటూ వేయించుకోవాలనే ఆలోచన వచ్చింది. దేశం కోసం ప్రాణాలు అర్పించిన సైనికుల పేర్లను పచ్చబొట్టు పొడిపించుకోవాలని నిర్ణయించుకున్నాడు.

దీని కోసం కార్గిల్ వార్ లో మరణించిన సైనికుల పేర్లను శోధించడానికి, వారి కుటుండాలను కలవడానికి ఓ ఏడాది సమయం తీసుకున్నాడు. తర్వాత తన శరీరంపై టాటూలను డిజైన్ చేయడానికి ఢిల్లీలో ఓ ఆర్టిస్ట్ ను ఎంచుకున్నాడు. అధిక పచ్చబొట్ల వల్ల వచ్చే ప్రమాదాల గురించి వైద్యులు హెచ్చరించినా తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోలేదు. కార్గిల్ లో మరణించిన 559 మంది సైనికుల పేర్లతో పాటు మరి కొందరు సైనికుల పేర్లను సైతం టాటూ వేయించుకున్నాడు. అంతేగాక మహాత్మాగాంధీ, రాణి లక్ష్మీబాయి, భగత్ సింగ్ సహా కొందరి చిత్రాలతో పాటు స్మారక స్తంభాన్ని కూడా పచ్చబొట్టు పొడిపించుకున్నాడు. ఈ అసాధారణ చర్యకు అభిషేక్ గౌతమ్ కు ఇండియా బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో స్థానం దక్కడంతో పాటు లివింగ్ వాల్ మెమోరియల్ అనే బిరుదును కూడా తెచ్చిపెట్టాయి. స్వతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రస్తుతం అభిషేక్ సింగ్ వార్తల్లోకి వచ్చాడు.

Advertisement

Next Story

Most Viewed