CJI :బతికుండగానే నరకాన్ని చూస్తున్నాం.. సీజేఐకు సివిల్స్‌ అభ్యర్థి లేఖ

by Hajipasha |   ( Updated:2024-07-29 13:53:18.0  )
CJI :బతికుండగానే నరకాన్ని చూస్తున్నాం.. సీజేఐకు సివిల్స్‌ అభ్యర్థి లేఖ
X

దిశ, నేషనల్ బ్యూరో : ఢిల్లీలోని కోచింగ్ సెంటర్లలో నిత్యం నరకయాతన అనుభవిస్తూ పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నాం అంటూ భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్‌కు సివిల్స్‌ అభ్యర్థి అవినాష్ దూబే లేఖ రాశారు. దేశ రాజధానిలోని రాజేంద్ర నగర్, ముఖర్జీ నగర్ పరిధిలోని కోచింగ్ ఇన్‌స్టిట్యూట్‌లలో ఉంటున్న విద్యార్థుల జీవన స్థితిగతులు దుర్భరంగా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. ఆయా ఏరియాల ప్రజలు డ్రైనేజీ వ్యవస్థ సరిగ్గా లేక ఏటా వర్షాకాలంలో వరదలతో పోరాడుతున్నారని దూబే చెప్పుకొచ్చారు. ‘‘మున్సిపల్ కార్పొరేషన్ అధికారుల నిర్లక్ష్యం వల్లే మురుగు కాల్వల నిర్వహణ సరిగ్గా లేదు. వరదల సమయంలో వర్షపునీటిలో మురుగు కలుస్తోంది. మురుగు కొన్నిసార్లు ఇళ్లలోకి కూడా ప్రవేశిస్తోంది’’ అని ఆయన లేఖలో ప్రస్తావించారు. ఢిల్లీలోని రావూస్ ఐఏఎస్ స్టడీ సర్కిల్ బేస్‌మెంట్‌లో ముగ్గురు సివిల్స్ అభ్యర్థుల మృతికి కారణమైన నిర్లక్ష్యపూరిత అధికారులు, సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని అవినాష్ దూబే డిమాండ్ చేశారు.

విద్యార్థుల జీవితాలకు భద్రత లేదని..

‘‘ఎన్నో వ్యయప్రయాసలకోర్చి మేం లక్ష్యం దిశగా పయనిస్తున్నాం. కానీ ఢిల్లీ కోచింగ్ సెంటర్ ఘటన మాలాంటి విద్యార్థుల జీవితాలకు భద్రత లేదని రుజువు చేసింది. ఆ సంఘటన హృదయ విదారకమైనది. తలుచుకుంటేనే గుండె పిండేస్తోంది. సురక్షితమైన, ఆరోగ్యకరమైన వాతావరణం కోచింగ్ సెంటర్లలో ఉంటేనే.. అభ్యర్థులు నిర్భయంగా చదువుకుని దేశాభివృద్ధిలో భాగస్వాములు అవుతారు’’ అని సివిల్స్‌ అభ్యర్థి అవినాష్ దూబే పేర్కొన్నారు. ‘‘విద్యార్థుల ప్రాథమిక హక్కులను పరిరక్షించాలి. ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడిపే హక్కు మాకు ఉంది’’ అని ఆయన లేఖలో తెలిపారు. ‘‘దేశ రాజధానిలో నెలకొన్న వరద సమస్యకు శాశ్వత పరిష్కారాన్ని కనుగొనాలి. ఢిల్లీ కోచింగ్ సెంటర్ తరహా ఘటనలు మళ్లీ జరిగితే అత్యవసరంగా ప్రతిస్పందించే రెస్క్యూ టీమ్స్, వైద్య టీమ్స్ ఉండాలి. వీటిపై సంబంధిత అధికారులను ఆదేశించండి’’ అని సుప్రీంకోర్టును అవినాష్ దూబే కోరారు. అయితే ఈ లేఖను పిటిషన్‌గా పరిగణించాలా వద్దా అనేది సీజేఐ డీవై చంద్రచూడ్ ఇంకా నిర్ణయించలేదు.

Advertisement

Next Story

Most Viewed