ఎంజీఆర్ టు తళపతి విజయ్.. పార్టీలు పెట్టిన హీరోలు ఎందరో తెలుసా?

by Swamyn |
ఎంజీఆర్ టు తళపతి విజయ్.. పార్టీలు పెట్టిన హీరోలు ఎందరో తెలుసా?
X

దిశ, నేషనల్ బ్యూరో: తమిళ స్టార్ హీరో తళపతి విజయ్ ఆ రాష్ట్ర రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు. తన పార్టీ పేరు ‘తమిళగ వెట్రి కళగం’(టీవీకే) అని శుక్రవారం అధికారికంగా ప్రకటించాడు. 2026లో జరగనున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్నట్టు వెల్లడించాడు. త్వరలో జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లోనూ పోటీ చేసే అవకాశం ఉంది. దీంతో తమిళనాడు రాజకీయాలు మరింత రసవత్తరంగా మారనున్నాయి. మిగతా రాష్ట్రాలతో పోలిస్తే తమిళనాడులో సినీనటుల ప్రభావం రాజకీయాల్లో చాలా ఎక్కువగా ఉంటుంది. పలువురు సినీ ప్రముఖులు తమిళ రాజకీయాల్లో ఇప్పటికే రాణిస్తున్నారు. అలాగే, తమిళనాడులో ఒక నటుడు పార్టీ పెట్టడం ఇదే తొలిసారి కాదు. గతంలోనూ పలువురు సినీప్రముఖులు పార్టీ పెట్టి రాష్ట్ర, దేశ రాజకీయాల్లో వాళ్ల అదృష్టాన్ని పరీక్షించుకున్నారు.




ఎంజీఆర్‌తో మొదలు

తమిళనాడులో తొలిసారిగా రాజకీయ పార్టీ పెట్టిన నటుడు మారుత్తూర్ గోపాలన్ రామచంద్రన్(ఎంజీఆర్). సినిమాల్లో రాణిస్తున్న సమయంలోనే ఎంజీఆర్ 1972 అక్టోబర్ 17న ‘ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నెట్ర కజగం’(ఏఐఏడీఎంకే) అనే పార్టీని స్థాపించారు. పార్టీ పెట్టిన ఐదేళ్లలోనే అధికారంలోకి వచ్చిన ఎంజీఆర్.. 1977లో తమిళనాడు సీఎంగా బాధ్యతలు చేపట్టారు. 1977-1980, 1980-85, 1985-87వరకు మొత్తం మూడుసార్లు సీఎంగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత అప్పటి స్టార్ హీరోయిన్ జయలలిత ఇదే పార్టీ తరఫున 1991లో సీఎంగా బాధ్యతలు చేపట్టారు. ఆమె 1991-96, 2001(130రోజుల పాటు), 2002-06, 2011-14, 2015-16 మధ్య ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు.




2005లో విజయ్‌కాంత్

తమిళనాడులో అప్పటి మరో స్టార్ విజయ్‌కాంత్ 2005లో ‘దేశీయ ముర్పొక్కు ద్రవిడ కజగమ్’(డీఎండీకే) పార్టీని స్థాపించారు. ఆయన పార్టీ ఇప్పటివరకు అధికారంలోకి రాకపోయినప్పటికీ 2011లో మాత్రం విజయ్‌కాంత్ అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా బాధ్యతలు చేపట్టారు. గతేడాది డిసెంబర్‌లో విజయ్‌కాంత్ మృతిచెందిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి పార్టీ వ్యవహారాలను ఆయన భార్య ప్రేమలతనే చూసుకుంటున్నారు.




కమల్ హాసన్

భారతీయ చిత్ర పరిశ్రమలోని అగ్రనటుల్లో ఒకరిగా వెలుగొందుతున్న కమల్ హాసన్ సైతం రాజకీయ పార్టీని స్థాపించారు. 2018 ఫిబ్రవరి 21న ‘మక్కల్ నీధి మయ్యం’(ఎంఎన్ఎం) పార్టీని స్థాపించిన కమల్.. తమిళనాడు, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చెరీ రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు.




శరత్ కుమార్

మరో నటుడు ఆర్ శరత్ కుమార్ 2007లో ‘ఆల్ ఇండియా సమథువ మక్కల్ కచ్చి’(ఏఐఎస్ఎంకే) అనే పార్టీని స్థాపించారు. 2011 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఏఐఏడీఎంకేతో పొత్తు పెట్టుకుని పోటీచేసిన శరత్ కుమార్ పార్టీ.. రెండు సీట్లను గెలుచుకుంది.




శివాజీ గణేశన్

మరో నటుడు శివాజీ గణేశన్ 1988లో ‘తమిళగ మున్నెట్ర మున్నని’(టీఎంఎం) అనే పార్టీని స్థాపించాడు. అయితే, పలు కారణాలరీత్య పార్టీని స్థాపించిన మరుసటి ఏడాదే 1989లో ‘జనతా దళ్’ పార్టీలో విలీనం చేశారు.

ఏఐఎన్ఎంకే

నటుడు, ప్లేబ్యాక్ సింగర్ కార్తీక్ 2009లో ‘అహిళ ఇండియా నాడలమ్ మక్కల్ కచ్చి’(ఏఐఎన్ఎంకే) అనే పార్టీని స్థాపించారు. అతని అభిమానులే ప్రధాన ఓటు బ్యాంకుగా ఉన్న ఆ పార్టీ.. పెద్దగా ప్రభావం చూపలేదు.




తెలుగులో ఎన్టీఆర్, చిరంజీవి, పవన్ కళ్యాణ్

తెలుగు రాష్ట్రాల్లోనూ సినీ నటులు స్థాపించిన పార్టీలు ఉన్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తొలిసారిగా సీనియర్ ఎన్టీఆర్ రాజకీయ పార్టీని స్థాపించారు. 1982 మార్చి 29న ‘తెలుగు దేశం పార్టీ’(టీడీపీ)ని ఏర్పాటు చేసిన ఆయన.. పార్టీని ప్రకటించిన ఏడాదిలోనే అధికారంలోకి వచ్చారు. దీంతో 1983లో తొలిసారి సీఎంగా బాధ్యతలు చేపట్టారు. 1984-85, 1985-89, 1994-95లలో ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఎన్టీఆర్ తర్వాత పార్టీని ప్రారంభించిన మరో నటుడు చిరంజీవి. తెలుగు సినీ పరిశ్రమలో అగ్రతారగా వెలుగొందుతున్న సమయంలోనే 2008లో చిరంజీవి ‘ప్రజా రాజ్యం పార్టీ’(పీఆర్పీ)ని స్థాపించారు. ఆ తర్వాతి పరిణామాలతో 2011లో పీఆర్పీని కాంగ్రెస్‌లో విలీనం చేశారు. ఇక, స్టార్ హీరోల్లో ఒకరైన పవన్ కళ్యాణ్.. 2014 మార్చి 14న జనసేన పార్టీని స్థాపించారు. పార్టీ స్థాపించిన ఏడాదిలోనే ఏపీకి ఎన్నికలు జరిగినా పోటీ చేయలేదు. కానీ, టీడీపీ, బీజేపీ తరఫున ప్రచారం చేశారు. 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయగా, కేవలం ఒక్క సీటు మాత్రమే గెలుచుకుంది. తాను పోటీ చేసిన రెండు స్థానాల్లోనూ పవన్ కళ్యాణ్ ఓడిపోయారు.

Advertisement

Next Story