Lalit modi: వనాటుకు మకాం మార్చిన లలిత్ మోడీ.. ప్రత్యేకతలు ఇవే!

by D.Reddy |
Lalit modi: వనాటుకు మకాం మార్చిన లలిత్ మోడీ.. ప్రత్యేకతలు ఇవే!
X

దిశ, వెబ్ డెస్క్: ఐపీఎల్‌ మాజీ ఛైర్మన్ లలిత్ మోడీ (Lalit modi) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. మనీలాండరింగ్‌, పన్ను ఎగవేత ఆరోపణలు ఎదుర్కొంటూ భారత్ నుంచి పారిపోయి ప్రస్తుతం లండన్‌లో తలదాచుకుంటున్న సంగతి తెలిసిందే. తాజాగా లలిత్ మోడీ తన మకాన్ని పసిఫిక్‌ ద్వీప దేశమైన వనాటుకు (Vanuatu) మార్చేశాడు. అంతేకాదు, 'గోల్డెన్ పాస్‌పోర్ట్' (Vanuatu Golden passport)ను కొనుగోలు చేసి ఆ దేశ పౌరసత్వాన్ని కూడా పొందాడు. భారత్ నుంచి విచారణ తప్పించుకునేందుకే వనాటు పౌరసత్వం తీసుకున్నారని తెలుస్తోంది. దీంతో ఇప్పుడు అంతా ఈ దేశం గురించి వెతుకుతున్నారు. ఎందుకు లలిత్ ఆ దేశానికి మకాం మార్చాడు? ఆ దేశంలో అంతా ప్రత్యేకత ఏముందని సెర్చ్ చేస్తున్నారు? ఈ నేపథ్యంలో వనాటు ప్రత్యేకతలు ఇక్కడ తెలుసుకుందాం.

3 లక్షల మంది పౌరులతో సుమారు 80 ద్వీపాల సమూహమైన వనాటు దేశం ప్రపంచంలో అతి చిన్న దేశాల్లో ఒకటి. అయితే, ఈ దేశంలో విదేశీయులకు 'Citizenship by Investment' (పెట్టుబడి ద్వారా పౌరసత్వం -CBI) పేరుతో గోల్డెన్‌ పాస్‌పోర్టు ద్వారా పౌరసత్వం ఇస్తుంది. ఇక ఈ పాస్ పోర్టుతో ప్రపంచంలోని 120 దేశాల్లో వీసా లేకుండా పర్యటించవచ్చు. వాటిలో బ్రిటన్, ఐరోపా దేశాలు ఉన్నాయి. అందుకే ప్రపంచ వ్యాప్తంగా సంపన్నులు ఈ దేశానికి చెందిన గోల్డెన్‌ పాస్‌పోర్టు తీసుకుంటుంటారు. అంతేకాదు, వనాటుకు ఆస్ట్రేలియాలోని సిడ్నీ నుంచి విమాన ప్రయాణం కేవలం 3 గంటలు మాత్రమే.

పైగా ఈ పాస్‌పోర్టు పొందేందుకు రూ.1.3 కోట్లు చెల్లిస్తే చాలు. పెద్దగా డాక్యుమెంట్లు కూడా సమర్పించాల్సిన అవసరం లేదు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకుని కూడా ఈ గోల్డెన్ పాస్‌పోర్టును పొందవచ్చు. అందుకే ఈ దేశ గోల్టెన్ పాస్‌పోర్టుకు భారీ డిమాండ్ ఉంది. ఈ దేశ ఆదాయం 40 శాతం ఈ పాస్‌పోర్టుల ద్వారా వస్తోందంటే అర్థం చేసుకోవచ్చు.

ఇక వనాటు గోల్డెన్ వీసా పొందిన వారి ఆ దేశంలో అనేక సౌకర్యాలు కల్పిస్తోంది. ముఖ్యంగా పన్ను మినహాయింపులు ఇస్తోంది. ఈ పాస్ పోర్ట్ ద్వారా పౌరసత్వం పొందితే అక్కడ ఎంత సంపాదించినా ట్యాక్స్ కట్టాల్సిన పని లేదు. స్థానికంగా, అంతర్జాతీయంగా ఎంత సంపాదించినా సరే ట్యాక్స్ అనే మాటే ఉండదు. ఆదాయ పన్నుగానీ, కార్పొరేట్‌ పన్నుగానీ, సంపద పన్నుగానీ లేవు. ముఖ్యంగా క్రిప్టో కరెన్సీకీ కేంద్రంగా ఉంది.

వనాటుతో మన దేశానికి నేరస్థుల అప్పగింత ఒప్పందం లేనందున భారతీయ దర్యాప్తు సంస్థల నుంచి తప్పించుకోవడానికి లలిత్‌ మోడీ ఈ పాస్‌పోర్టును తీసుకుని ఉండవచ్చని తెలుస్తోంది. కాగా, గత రెండేళ్లలో 30 మంది ప్రవాస భారతీయులు ఇక్కడ పౌరసత్వం తీసుకున్నారు. మన కంటే అత్యధికంగా చైనీయులు పౌరసత్వం తీసుకుంటున్నారు. అలాగే, అంతర్జాతీయ నేరగాళ్లు వనాటులో గోల్డెన్‌ పాస్‌పోర్టులు తీసుకుని ఐరోపా దేశాల్లోకి సులభంగా ప్రవేశించి, నేరాలకు పాల్పడుతున్నారు.



Next Story

Most Viewed