ఢిల్లీలో లడఖ్ వాసుల నిరాహార దీక్ష.. ఎందుకంటే?

by Mahesh Kanagandla |
ఢిల్లీలో లడఖ్ వాసుల నిరాహార దీక్ష.. ఎందుకంటే?
X

దిశ, నేషనల్ బ్యూరో: కేంద్ర పాలిత ప్రాంతం లడఖ్‌కు రాష్ట్ర హోదా కల్పించాలని, అలాగే రాజ్యాంగంలోని ఆరో షెడ్యూల్‌లో చేర్చాలని లడఖ్ యాక్టివిస్ట్ సోనమ్ వాంగ్‌చుక్ డిమాండ్ చేశారు. ఈ డిమాండ్లను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడానికి చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో మరోదారి లేక నిరవధిక నిరాహార దీక్ష చేపడుతున్నామని వెల్లడించారు.కేంద్ర ప్రభుత్వ పెద్దలను కలిసే ఏర్పాట్లు చేస్తామనే హామీలు తప్పా.. ఎప్పుడూ వారిని కలిసే అవకాశాన్ని ఇవ్వలేదని వివరించారు. శాంతియుతంగా ధర్నా చేయడానికీ తగిన లొకేషన్‌ను తమకు కేటాయించడం లేదని, అందుకే ఢిల్లీలోని లడఖ్ భవన్‌లోనే తాము నిరవధిక నిరాహార దీక్ష చేపడుతున్నామని ప్రకటించారు.

‘మేం శాంతియుతంగా నిరాహార దీక్ష చేపట్టడానికి తగిన లొకేషన్‌ను కోరాం. కానీ, ఇవ్వడం లేదు. గత్యంతరం లేక మేం లడఖ్ భవన్‌లోనే నిరాహార దీక్ష మొదలు పెట్టాం. మన దేశ టాప్ లీడర్లను కలిసే అవకాశమిస్తామని హామీలు ఇస్తున్నా.. ఎప్పుడు అనేదానిపై స్పష్టత లేదు. దీంతో రాజ్‌ఘాట్‌లో విరమించిన మా నిరాహార దీక్షను మేం మళ్లీ మొదలు పెట్టాం. 30 నుంచి 32 రోజులు నడిచాక మేం ఢిల్లీ చేరుకున్నాం. కేంద్ర ప్రభుత్వ పెద్దలను కలిసి మా సమస్యలు వివరించాలనేదే మా ఏకైక డిమాండ్’ అని వాంగ్‌చుక్ వివరించారు. ‘మేం ఎవరి నుంచీ మద్దతు కోరడం లేదు. కానీ, లడఖ్‌లో ఏం జరుగుతున్నది? మా హక్కులు ఏమిటో తెలిసిన వారిని ఆహ్వానిస్తున్నాం.

150 మంది మద్దతుదారులతో ఇదే వారంలో వాంగ్‌చుక్ హర్యానా-ఢిల్లీ సరిహద్దు చేరుకున్నాక ఢిల్లీ పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. వెనక్కి వెళ్లిపోవాలని పోలీసులు సూచించగా నిరాకరించారు. బీఎన్ఎస్ సెక్షన్ 163 కింద అమలవుతున్న నిషేధాజ్ఞలను ఉల్లంఘించారని వివరిస్తూ పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. ‘పోలీసులతో మాకు వ్యక్తిగత కక్ష్యలేమీ లేవు. వాస్తవానికి వారి అరెస్టు తర్వాత మా సమస్యల గురించి దేశం చర్చిస్తున్నది. పోలీసుల అదుపులో ఉన్నప్పుడు గాంధీ బోధనలతో ప్రేరణ పొందిన ‘సత్యాగ్రహ’ను తాము చేపట్టాం. నిరాహర దీక్షకు కూర్చున్నాం. మమ్మల్ని రాజ్‌ఘాట్‌కు తీసుకెళ్లాలని లేదా ప్రధానమంత్రి, రాష్ట్రపతి, హోం మంత్రి ఎవరితోనైనా కలిసే ఏర్పాట్లు చేయాలని కోరగా అధికారులు అంతే సానుకూలంగా స్పందించారు. కానీ, అందుకు అవకాశం ఇవ్వకపోవడంతో తాము ఢిల్లీలోని లడఖ్ భవన్‌లో నిరవధిక నిరాహార దీక్ష చేపడుతున్నాం’ అని వాంగ్‌చుక్ వివరించారు.

Advertisement

Next Story