Kerala Police: నకిలీ లాటరీ ప్రకటనలపై గూగుల్, మెటాకు కేరళ పోలీసుల నోటీసులు

by S Gopi |
Kerala Police: నకిలీ లాటరీ ప్రకటనలపై గూగుల్, మెటాకు కేరళ పోలీసుల నోటీసులు
X

దిశ, నేషనల్ బ్యూరో: ఆన్‌లైన్‌లో నకిలీ లాటరీ టికెట్‌లను విక్రయిస్తున్న యాప్‌లను ప్లేస్టోర్ నుంచి తొలగించాలని కేరళ పోలీసులు గూగుల్‌కు నోటీసు జారీ చేశారు. గూగుల్‌తో పాటు సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లైన ఫేస్‌బుక్, వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్ నుంచి నకిలీ లాటరీల ప్రకటనలను తొలగించాలని మెటాకు కూడా ఇదే విధమైన నోటీసు జారీ చేసినట్లు స్టేట్ పోలీస్ మీడియా సెంటర్ (ఎస్‌పీఎంసీ) బుధవారం ఒక ప్రకటనలో వెల్లడించింది. 60 నకిలీ లాటరీ యాప్‌లు, 25 నకిలీ ఫేస్‌బుక్ ప్రొఫైల్‌లు, 20 వెబ్‌సైట్‌లు ఈ స్కామ్‌తో సంబంధాలు కలిగి ఉన్నాయని సైబర్ పెట్రోలింగ్‌లో తేలడంతో పోలీసులు ఈ దిశగా చర్యలు తీసుకున్నట్లు ఎస్‌పీఎంసీ తన అధికారిక ప్రకటనలో తెలిపింది. ఈ మోసానికి పాల్పడిన వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది.

స్కామ్‌కు సంబంధించిన వివరాలను పోలీసులు తెలియజేస్తూ.. 'కేరళ మెగామిలియన్ లాటరీ', 'కేరళ సమ్మర్ సీజన్ ధమాకా' పేరుతో కొంతకాలంగా వాట్సాప్, టెలిగ్రామ్, ఇన్‌స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో నకిలీ ప్రకటనలు చక్కర్లు కొడుతున్నాయి. వాటిని రాష్ట్ర ప్రభుత్వమే నిర్వహిస్తోందని, ఆన్‌లైన్‌లో కొనుగోలు చేయవచ్చని తప్పుడు సమాచారం సర్క్యులేట్ చేస్తున్నారు. రూ. 40 ఖర్చు చేస్తే రూ. 12 కోట్ల వరకు గెలుచుకునే అవకాశం ఉందంటూ ప్రజలకు మెసేజ్‌లు పంపిస్తున్నారు. కొంత మొత్తం గెలిచినట్టు మోసగించి వారి నుంచి ప్రైజ్ మనీ తీసుకోవాలంటే జీఎస్టీ, స్టాంప్ డ్యూటీ చెల్లించాలని చెబుతూ మోసగిస్తున్నారని' వివరించారు. నకిలీ పత్రాలు, వీడియోలతో మోసాలు చేస్తున్నారని పోలీసు అధికారులు పేర్కొన్నారు. ఇలాంటి ఆన్‌లైన్ లాటరీ మోసాల బారిన పడకుండా జాగ్రత్తగా ఉండాలని, అలాంటి వాటిపై సందేహాలుంటే 1930 నంబర్‌కు కాల్ చేయాలని కోరారు.

👉 Download Dishadaily Android App
👉 Download Dishadaily IOS App
👉 Follow us on whatsApp channel
👉 Follow us on Share chat

Next Story

Most Viewed