జైలు నుంచే కేజ్రీవాల్ పాలన షురూ!: తొలి ఉత్తర్వులు జారీ

by samatah |
జైలు నుంచే కేజ్రీవాల్ పాలన షురూ!: తొలి ఉత్తర్వులు జారీ
X

దిశ, నేషనల్ బ్యూరో: లిక్కర్ స్కాంలో అరెస్టైన ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ జైలు నుంచే పరిపాలన కొనసాగిస్తున్నట్టు తెలుస్తోంది. జైలు నుంచి ప్రభుత్వానికి సంబంధించిన తొలి అధికారిక ఉత్తర్వులు ఆదివారం జారీ చేసినట్టు ఆప్ వర్గాలు తెలిపాయి. జలవనరుల శాఖకు ఈ ఆర్డర్స్ జారీ చేసినట్టు సమాచారం. ఢిల్లీలో నీటి సరఫరాకు చెందిన ఈ ఆదేశాలు జలవనరుల మంత్రిత్వ శాఖ బాధ్యతలు చేపడుతున్న అతిశీకి ఓ నోట్ ద్వారా పంపినట్టు తెలుస్తోంది. కాగా, కేజ్రీవాల్‌ను ఈ నెల 21 లిక్కర్ పాలసీ కేసులో ఈడీ అరెస్టు చేసింది. దీంతో కేజ్రీవాల్ జైలు నుంచే ప్రభుత్వాన్ని నడుపుతారని ఆప్ స్పష్టం చేసింది. అయితే అప్పటి నుంచి జైలుకు వెళ్లిన వ్యక్తి ప్రభుత్వాన్ని కొనసాగించవచ్చా అనే చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలోనే కేజ్రీవాల్ తొలి ఉత్తర్వులు జారీ చేయడం గమనార్హం.

ఆప్ కార్యకర్తల నిరసన

కేజ్రీవాల్ అరెస్టుకు వ్యతిరేకంగా ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చింది. ఢిల్లీలోని ఐటీఓ వద్ద ఫుట్ ఓవర్ బ్రిడ్జిపై ఆప్ కార్యకర్తలు కేజ్రీవాల్‌కు మద్దతుగా నినాదాలు చేశారు. పోలీసులు నిరసనకారులను చెదరగొట్టడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. దీంతో ఢిల్లీలో భారీగా భద్రతను మోహరించారు. అలాగే తాజా పరిణామాలపై ఢిల్లీ మంత్రి అతిశీ మీడియా సమావేశం నిర్వహించి మరిన్ని వివరాలను వెల్లడించనున్నట్టు తెలుస్తోంది. మరోవైపు కేజ్రీవాల్ సీఎం పదివికి రాజీనామా చేయకపోవడాన్ని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ పరిశీలిస్తున్నట్లు సన్నిహిత వర్గాలు తెలిపాయి.

Advertisement

Next Story