స్వాతి మలివాల్ పై కేజ్రీవాల్ పీఏ దాడి!.. ఢిల్లీ పోలీసులకు ఫోన్ కాల్స్

by samatah |
స్వాతి మలివాల్ పై కేజ్రీవాల్ పీఏ దాడి!.. ఢిల్లీ పోలీసులకు ఫోన్ కాల్స్
X

దిశ, నేషనల్ బ్యూరో: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ పీఏ భిభవ్ కుమార్ ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) రాజ్యసభ ఎంపీ, ఢిల్లీ మహిళా కమిషన్ మాజీ చీఫ్ స్వాతి మలివాల్‌పై సోమవారం దాడి చేసినట్టు తెలుస్తోంది. సీఎం నివాసంలోనే ఈ ఘటన జరిగినట్టు సమాచారం. ఈ మేరకు కేజ్రీవాల్ నివాసం నుంచి ఢిల్లీ పోలీసులకు స్వాతి రెండు సార్లు కాల్ చేసినట్టు సన్నిహిత వర్గాలు తెలిపాయి. కేజ్రీవాల్‌ను కలవడానికి స్వాతి సీఎం నివాసంలో వేచి ఉండగా..మలివాల్‌పై అసభ్యకరంగా ప్రవర్తించిన భిభవ్ కుమార్ అనంతరం దాడికి పాల్పడినట్టు పలు కథనాలు పేర్కొన్నాయి. స్థానిక ప్రజలు భిభవ్‌ను అడ్డుకున్నట్టు తెలిపాయి. అయితే పోలీసు సిబ్బంది అక్కడికి చేరుకున్నప్పుడు మలివాల్ సీఎం నివాసం వద్ద లేనట్టు సమాచారం. ఈ దాడిపై అప్ వర్గాలు అధికారికంగా స్పందించలేదు.

మలివాల్ సివిల్ లైన్స్ పోలీస్ స్టేషన్‌కు వచ్చినప్పటికీ ఎటువంటి ఫిర్యాదు చేయకుండా వెళ్లిపోయినట్టు తెలుస్తోంది. ఈ ఆరోపణలపై బీజేపీ స్పందించింది. ఆ పార్టీ ఢిల్లీ అధికార ప్రతినిధి మాట్లాడుతూ..దీనిపై సీఎం కార్యాలయం వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. సీఎం ఇంట్లోనే మహిళలకు రక్షణ లేకుండా పోయిందని, ఇది చాలా తీవ్రమైన విషయమని తెలిపారు. ఈ వ్యవహారంపై కేజ్రీవాల్ స్పందించాలని వెల్లడించారు. బీజేపీ ఐటీ సెల్ ఇన్‌చార్జ్ అమిత్ మాలవీయ స్పందిస్తూ..ఈ ఘటనపై కేజ్రీవాల్ మౌనం వీడాలని తెలిపారు. కాగా, స్వాతి మలివాల్‌ను ఆప్ ఇటీవలే రాజ్యసభకు నామినేట్ చేసింది.

Advertisement

Next Story