Karnataka Clashes: గణేష్ నిమజ్జన ఊరేగింపుపై రాళ్ల దాడి.. కర్ణాటకలో ఉద్రిక్తత

by vinod kumar |
Karnataka Clashes: గణేష్ నిమజ్జన ఊరేగింపుపై రాళ్ల దాడి.. కర్ణాటకలో ఉద్రిక్తత
X

దిశ, నేషనల్ బ్యూరో: కర్ణాటకలోని మాండ్య జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నాగమంగళ పట్టణంలో గణపతి ఊరేగింపు సందర్భంగా రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దరికొప్పలు గ్రామానికి చెందిన పలువురు వ్యక్తులు వినాయకుడిని నిమజ్జనం కోసం ఊరేగింపుగా తీసుకెళ్తున్నారు. ఈ క్రమంలో నాగమంగళలోని ప్రధాన రహదారి పక్కనే ఉన్న మసీదు వద్దకు రాగానే కొందరు వ్యక్తులు రాళ్ల దాడికి పాల్పడ్డారు. అనంతరం రెండు వర్గాల మధ్య హింసాత్మక పరిస్థితులు నెలకొన్నాయి. పరస్పరం ఒకరకొకరు రాళ్లు రువ్వుకున్నారు. ఆగ్రహించిన కొందరు వ్యక్తులు స్థానికంగా ఉండే దుకాణాలను ధ్వంసం చేశారు. పార్క్ చేసిన వాహనాలకు నిప్పు పెట్టారు.

విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఆ ప్రాంతంలో ఆంక్షలు విధించారు. పెద్ద సంఖ్యలో జనం రావడంతో పరిస్థితిని అదుపు చేసేందుకు లాఠీచార్జి చేశారు. 20 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనలో 15 మంది పోలీసులకు సైతం గాయాలైనట్టు తెలుస్తోంది. ఘటనకు బాధ్యులైన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ పోలీస్ స్టేషన్ వద్ద హిందూ సంఘాలు నిరసనకు దిగాయి. అయితే ఊరేగింపు మసీదు సమీపంలోకి వచ్చినప్పుడు వారు కదలకుండా ఎక్కువ సమయం గడిపారని ఎస్పీ మల్లికార్జున్ బాలదండి తెలిపారు. ఈ క్రమంలోనే ఘర్షణ ప్రారంభమైందని వెల్లడించారు. ఘటనకు కారణమైన వారిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు.

Advertisement

Next Story

Most Viewed