కెనడా విదేశాంగ మంత్రితో జైశంకర్ భేటీ: ఉద్రిక్తతల వేళ కీలక పరిణామం

by samatah |
కెనడా విదేశాంగ మంత్రితో జైశంకర్ భేటీ: ఉద్రిక్తతల వేళ కీలక పరిణామం
X

దిశ, నేషనల్ బ్యూరో: కెనడా విదేశాంగ శాఖ మంత్రి మెలానీ జోలీతో భారత విదేశాంగ మంత్రి జై శంకర్ భేటీ అయ్యారు. జర్మనీలో జరుగుతున్న మ్యూనిచ్ సెక్యురిటీ కాన్ఫరెన్సులో భాగంగా వీరిద్దరూ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఇరువురు నేతలు భారత్, కెనడాల మధ్య సంబంధాలపై చర్చించారు. అంతేగాక ప్రపంచ పరిస్థితుల పైనా డిస్కస్ చేసినట్టు తెలుస్తోంది. ఈ భేటీపై జైశంకర్ ఎక్స్‌లో పోస్టు చేశారు. ‘కెనడియన్ కౌంటర్ మెలానీతో భేటీ కావడం సంతోషకరం. ఈ సమావేశంలో ఇరు దేశాల సంబంధాలు, ప్రపంచ పరిస్థితులపై చర్చించాం’ అని పేర్కొన్నారు. కాగా, గతేడాది ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యలో భారత ప్రభుత్వ ప్రమేయం ఉందని కెనడా ప్రధాని జస్టిస్ ట్రూడో ఆరోపణలు చేయడంతో భారత్-కెనడాల మధ్య దౌత్య సంబంధాలు దెబ్బతిన్నాయి. ఈ నేపథ్యంలోనే వీరిద్దరు భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. అంతకుముందు జైశంకర్ జర్మన్ కౌంటర్ అన్నాలెనా బేర్‌బాక్‌, అర్జెంటీనా కౌంటర్ డయానా మొండినోతోనూ సమావేశమయ్యారు.

మ్యూనిచ్ సెక్యురిటీ కాన్ఫరెన్సు!

మ్యూనిచ్ సెక్యురిటీ కాన్ఫరెన్సును ప్రతి ఏటా జర్మనీలో నిర్వహిస్తారు. అంతర్జాతీయ భద్రతా విధానాలను ఈ సమావేశం వేదికగా చర్చిస్తారు. 1963లో ఇది ప్రారంభం కాగా.. ప్రస్తుతం నిర్వహిస్తున్న మీటింగ్ 60వ సమావేశం. ఈ నెల18వరకు ఇది జరగనుంది. అమెరికాలోని జర్మన్ రాయబారి క్రిస్టోఫ్ హ్యూస్జెన్ అధ్యక్షతన ఈ ఏడాది సదస్సు జరుగుతోంది. గత నాలుగు దశాబ్దాలుగా మ్యూనిచ్ సెక్యూరిటీ కాన్ఫరెన్స్ అంతర్జాతీయ భద్రతా విధాన నిర్ణయాధికారుల అభిప్రాయాలను పంచుకోవడంలో కీలక వేదికగా మారింది. సుమారు 70కి పైగా దేశాలు, 350కి పైగా ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరవుతారు.

Advertisement

Next Story