Rakesh Tikait : విపక్ష పాలిత రాష్ట్రం కాబట్టే బెంగాల్‌ను టార్గెట్ చేస్తున్నారు : రాకేశ్ టికాయత్

by Hajipasha |
Rakesh Tikait : విపక్ష పాలిత రాష్ట్రం కాబట్టే బెంగాల్‌ను టార్గెట్ చేస్తున్నారు :  రాకేశ్ టికాయత్
X

దిశ, నేషనల్ బ్యూరో : కోల్‌కతా మెడికల్ కాలేజీ ఘటనపై కొన్ని పార్టీలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని రైతు నేత రాకేశ్ టికాయత్ మండిపడ్డారు. బెంగాల్‌లోని మమతా బెనర్జీ(టీఎంసీ పార్టీ) ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకునేందుకు ఈ ఘటనను అస్త్రంగా మలుచుకుంటున్నారని ఆయన ఆరోపించారు. దేశంలో ఇంకెన్నో ఘటనలు జరుగుతున్నా.. ప్రతిపక్ష పాలిత రాష్ట్రం కాబట్టే బెంగాల్‌లో చోటుచేసుకున్న ఒక ఘటనను భూతద్దంలో చూపించే ప్రయత్నం చేస్తున్నారని రాకేశ్ టికాయత్ అభిప్రాయపడ్డారు. రోజులో దాదాపు 8 నుంచి 10 గంటల పాటు కోల్‌కతా ఘటనకు సంబంధించిన న్యూస్‌నే టీవీ ఛానళ్లు కవర్ చేస్తున్నాయని ఆయన తెలిపారు.

దేశ ప్రజలు ఎదుర్కొంటున్న ఇతర సమస్యలు ఆ టీవీ ఛానళ్లకు కనిపించడం లేదా అని టికాయత్ ప్రశ్నించారు. సీబీఐ దర్యాప్తు జరుగుతున్నప్పుడు ఆ కేసుపై రాజకీయ పార్టీలు నోరుపారేసుకోవడంలో అర్థమే లేదన్నారు. ‘‘బెంగాల్ ఘటనకు మరో విపక్ష పాలిత రాష్ట్రం పంజాబ్‌తో లింకులు పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. విపక్ష పాలిత రాష్ట్రాల సీఎంలను జైలులో వేస్తారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఏదైనా జరిగినా అక్కడి సీఎంలు సేఫ్‌గానే ఉంటారు’’ అని ఆయన ఎద్దేవా చేశారు. కాగా, రాకేశ్ టికాయత్ వ్యాఖ్యలను బీజేపీ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా ఖండించారు. ఆయన సిగ్గుమాలిన వ్యాఖ్యలు చేశారని వ్యాఖ్యానించారు.అచ్చం రాహుల్ గాంధీ లాంటి స్వరాన్నే టికాయత్ వినిపిస్తున్నారని పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed