Supreme Court: ఉచిత హామీలపై విచారణ చాలా అవసరం: సుప్రీంకోర్టు

by Harish |   ( Updated:2024-09-18 12:16:16.0  )
Supreme Court: ఉచిత హామీలపై విచారణ చాలా అవసరం: సుప్రీంకోర్టు
X

దిశ, నేషనల్ బ్యూరో: ఎన్నికలు వచ్చింది మొదలు రాజకీయ పార్టీలు ఉచిత హామీలతో ఓటర్లను ఆకట్టుకోవడానికి ప్రయత్నిస్తాయి. ఈ నేపథ్యంలో ఇటీవల కాలంలో ఉచిత హామీలు ఎక్కువ అయిన నేపథ్యంలో దీన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను పరిగణనలోకి తీసుకోవాలని, వీటి విచారణ అత్యంత ముఖ్యమని సుప్రీంకోర్టు(Supreme Court) బుధవారం పేర్కొంది. దీనికి సంబంధించి అవతలి పక్షం వాదనలు కూడా వినాల్సి ఉండటంతో ప్రస్తుతం విచారణ కుదరదని కానీ పరిగణనలోకి తీసుకుంటామని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌, న్యాయమూర్తులు జేబీ పార్దివాలా, మనోజ్‌ మిశ్రాలతో కూడిన ధర్మాసనం తెలిపింది.

అంతకుముందు ఉచిత హామీలు ఇచ్చే రాజకీయ పార్టీల గుర్తుల్ని నిలిపివేయాలని అలాగే వాటిని రద్దు చేసేలా ఎలక్షన్ కమిషన్‌కు ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ మార్చి 20న న్యాయవాది అశ్విని ఉపాధ్యాయ పిటిషన్ దాఖలు చేశారు. ఉచితాలను అందించడం అనేది లంచగొండితనానికి సమానమైన అనైతిక ప్రవర్తన అని, ఇది ప్రజాస్వామ్య విలువలు, రాజ్యాంగ స్ఫూర్తికి విఘాతం కలిగిస్తుందని తన పిటిషన్‌లో పేర్కొన్నారు. ఓటర్లను ఆకట్టుకోవడానికి ఇలాంటి ఉచితాలు ఇవ్వడం ద్వారా అధికారంలో ఉండటానికి మభ్య పెట్టినట్లవుతుందని తన పిటిషన్‌లో తెలిపారు. అయితే తాజాగా దీనిని విచారించాలని పిటిషనర్ కోర్టును కోరగా దీనికి సంబంధించి అవతలి పక్షం వాదనలు కూడా వినాల్సి ఉండటంతో ప్రస్తుతం విచారణ కుదరదని న్యాయమూర్తి పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed