Omar Abdullah: అభివృద్ధికి ఆర్టికల్ 370 రద్దుతో సంబంధం లేదు

by Shamantha N |
Omar Abdullah: అభివృద్ధికి ఆర్టికల్ 370 రద్దుతో సంబంధం లేదు
X

దిశ, నేషనల్ బ్యూరో: జమ్ముకశ్మీర్‌లో ప్రధాని నరేంద్ర మోడీ పర్యటించి.. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. అయితే, ఇలాంటి సమయంలో జమ్ముకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా(CM Omar Abdullah) కీలక వ్యాఖ్యలు చేశారు. ఆర్టికల్‌-370(Article 370) రద్దుతో జమ్ముకశ్మీర్‌లో ప్రస్తుతం జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధమే లేదన్నారు. 370 రద్దు కంటే ముందే ఆ ప్రాంతంలో అభివృద్ధి పనులు జరిగాయన్నారు. అభివృద్ధికి, ఆర్టికల్‌ 370 రద్దుకు లింక్‌ పెట్టొద్దు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ‘జమ్ము కశ్మీర్‌లోని మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను ఆర్టికల్ 370తో ముడిపెట్టవద్దు. దీనికి రాజకీయాలతో సంబంధం లేదు. ఈ ప్రాజెక్టులు ఏవీ ఆగస్టు 5, 2019 తర్వాత ప్రారంభించినవి కావు. అంతకంటే ముందుగానే ప్లాన్ చేసినవి. ఆర్టికల్ 370 రద్దుతో సంబంధం లేకుండా జరిగిన అభివృద్ధి ఇది. ఈ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు అల్లర్లు జరిగిన ప్రాంతాల్లో లేవు.” అని ఒమర్ అబ్దుల్లా చెప్పుకొచ్చారు.

జమ్ముకశ్మీర్ లో దాడుల గురించి..

జమ్ముకశ్మీర్‌లో 2008, 2010, 2016లో గణనీయంగా రాళ్లదాడులు, నిరసన కార్యక్రమాలు జరిగేవని గుర్తుచేశారు. కానీ, ప్రస్తుతం దాడులు, నిరసనల వంటి కార్యకలాపాలు చాలా వరకు తగ్గాయన్నారు. ఆ విషయాన్ని తాను అంగీకరిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. అయితే, ఇదంతా కొంతమేర ప్రభుత్వం తీసుకున్న కఠిన నిర్ణయాల కారణంగానే జరిగిందన్నారు. ‘సీఐడీ విభాగాన్ని ఆయుధంగా మార్చడం, ఉద్యోగులను తొలగించడం, వ్యక్తులను బ్లాక్‌లిస్ట్ చేయడం సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధం’ అని అన్నారు. న్యాయమైన పాలన కోసం అబ్దుల్లా పిలుపునిచ్చారు. మార్పును ప్రజలు అంగీకరించాలన్నారు. వారు మనస్పూర్తిగా అంగీకరిస్తే అది ప్రశంసనీయం అని.. కానీ భయం నుంచి పురోగతి వస్తే ప్రశ్నించాల్సిందే అని అన్నారు. జమ్ముకశ్మీర్‌లో ప్రస్తుత పరిస్థితి రెండింటి మిశ్రమంగా ఉందన్నారు.

Next Story