‘డీలిమిటేషన్’, ‘జమిలి పోల్స్‌’కు నై: తమిళనాడు అసెంబ్లీలో 2 సంచలన తీర్మానాలు

by Hajipasha |
‘డీలిమిటేషన్’, ‘జమిలి పోల్స్‌’కు నై: తమిళనాడు అసెంబ్లీలో 2 సంచలన తీర్మానాలు
X

దిశ, నేషనల్ బ్యూరో : తమిళనాడు అసెంబ్లీ బుధవారం రెండు కీలక తీర్మానాలను ఆమోదించింది. జమిలి ఎన్నికలు (వన్ నేషన్ వన్ ఎలక్షన్), కొత్త జనాభా లెక్కలకు అనుగుణంగా నియోజకవర్గాల పునర్విభజనకు (డీలిమిటేషన్) వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేశారు. ఈసందర్భంగా సభను ఉద్దేశించి ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ మాట్లాడారు. కొత్త జనాభా లెక్కల ప్రకారం నియోజకవర్గాలను పునర్విభజన చేస్తే.. జనాభాను సమర్ధవంతంగా కంట్రోల్ చేసిన తమిళనాడు వంటి రాష్ట్రాలకు శిక్షపడినట్లు అవుతుందన్నారు. జనాభాను కంట్రోల్ చేయడంలో విఫలమైన రాష్ట్రాల పాలిట డీలిమిటేషన్ ప్రక్రియ వరంలా మారుతుందని సీఎం చెప్పారు. ‘‘1971 నాటికి తమిళనాడు, బిహార్‌ రాష్ట్రాల జనాభా దాదాపు సమానంగా ఉండేది. అయితే గత ఐదు దశాబ్దాల్లో బిహార్ జనాభా తమిళనాడు కంటే ఒకటిన్నర రెట్లు ఎక్కువ పెరిగింది. 39 మంది ఎంపీలే ఉండటంతో ఇప్పటికే మేం అడుక్కుంటున్నాం. నియోజకవర్గాల పునర్విభజన తర్వాత మా అసెంబ్లీ, లోక్‌సభ స్థానాలు తగ్గితే ఇంకా ఏమవుతుందో ఊహించుకోవచ్చు’’ అని స్టాలిన్ వ్యాఖ్యానించారు. జమిలి ఎన్నికలకు రాజ్యాంగ బద్ధత లేదని ఆయన అన్నారు. ఇంత పెద్ద భారతదేశంలో ఏకకాలంలో ఎన్నికల నిర్వహణ పెద్ద సవాలేనని చెప్పారు. ఈ తీర్మానాలకు కాంగ్రెస్ సహా డీఎంకే మిత్రపక్షాలు మద్దతు పలికాయి. ఏఐఏడీఎంకే ‘వన్ నేషన్ వన్ ఎలక్షన్’ పథకానికి షరతులతో కూడిన మద్దతు ప్రకటించింది. నియోజకవర్గాల పునర్విభజనకు వ్యతిరేకంగా ప్రవేశపెట్టిన తీర్మానానికి పూర్తి మద్దతు ఇస్తున్నట్లు వెల్లడించింది. ఇక జమిలి ఎన్నికలను వ్యతిరేకిస్తూ చేసిన తీర్మానాన్ని బీజేపీ ఖండించింది. డీలిమిటేషన్ వ్యతిరేక తీర్మానానికి మద్దతు ప్రకటించింది.

Advertisement

Next Story