- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Waqf : వక్ఫ్‌బోర్డుల సవరణ బిల్లుపై ఎవరెవరు ఏమేం అన్నారంటే..
దిశ, నేషనల్ బ్యూరో : బ్రిటీష్ కాలం నాటి ‘ముసల్మాన్ వక్ఫ్ యాక్ట్ -1923’ని రద్దు చేసేందుకు ఉద్దేశించిన ‘ముసల్మాన్ వక్ఫ్ రద్దు బిల్లు - 2024’ను కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు గురువారం లోక్‌సభలో ప్రవేశపెట్టారు. దాని స్థానంలో ‘వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు-2024’ను చట్టరూపంలో అమల్లోకి తెస్తామని వెల్లడించారు. 1995 నాటి వక్ఫ్ చట్టంలో దాదాపు 40 సవరణలు చేసి సవరణ బిల్లును తీసుకొచ్చామన్నారు. అనంతరం దీనిపై సభలో చర్చ ప్రారంభించారు. విపక్ష నేతల విమర్శలను కౌంటర్ చేస్తూ రిజిజు కీలక వివరాలను సభలో వెల్లడించారు. ‘‘దేశంలోని ముస్లిం వర్గానికి చెందిన అతికొద్ది మంది చేతుల్లో వక్ఫ్ బోర్డులు ఉండిపోయాయి. పలువురు విపక్ష ఎంపీలు నాతో మాట్లాడుతూ వాళ్ల రాష్ట్రాల్లో వక్ఫ్ బోర్డులు మాఫియాలా మారాయని చెప్పారు’’ అని ఆయన పేర్కొన్నారు. ‘‘సచార్ కమిటీ నివేదిక, లక్షలాది మందితో సంప్రదింపుల తర్వాతే ఈ బిల్లును రూపొందించాం. దీనిపై దేశవ్యాప్తంగా సంప్రదింపులు జరిపాకే పార్లమెంటు ముందుకు తెచ్చాం’’ అని రిజిజు చెప్పారు. ‘‘వక్ఫ్ బోర్డుల్లో ముస్లింలలోని అన్ని వర్గాలకు తగిన ప్రాధాన్యం ఇవ్వాలని సచార్ కమిటీ చెప్పింది. ఆ కమిటీని వేసింది తామే అని చెప్పుకునేందుకు విపక్ష పార్టీలు సంతోషించాలి. ముస్లిం మైనారిటీలలోని ఒక వర్గం ఇతర వర్గాలను అణచివేస్తుంటే పార్లమెంటు దాన్ని ఎలా అనుమతించగలదు’’ అని కేంద్ర మంత్రి వ్యాఖ్యానించారు. ‘‘ఇప్పటివరకు హక్కులు పొందని వారికి వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుతో ప్రయోజనం చేకూరుతుంది. వక్ఫ్ బోర్డులో వివిధ మతాల సభ్యులుండాలని మేం చెప్పట్లేదు. పార్లమెంట్ సభ్యుడు మాత్రం బోర్డులో ఉండాలని అంటున్నాం. ముస్లిం మహిళలకూ బోర్డులో అవకాశం ఇవ్వాలని కోరుతున్నాం’’ అని కేంద్రమంత్రి వివరించారు. వక్ఫ్ బోర్డు సవరణ బిల్లును ప్రతిపక్షాలు వ్యతిరేకించడంతో జాయింట్ పార్లమెంటరీ కమిటీ(జేపీసీ)కి పంపుతామని కిరణ్ రిజిజు ప్రకటించారు.
మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీసు వక్ఫ్ ఆస్తా ?
‘‘గుజరాత్‌లోని సూరత్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయాన్ని వక్ఫ్ ఆస్తిగా ప్రకటించారు. మున్సిపల్ కార్పొరేషన్ ప్రైవేట్ ఆస్తి ఎలా అవుతుంది ? మున్సిపల్ ఆస్తులను వక్ఫ్ ఆస్తిగా ఎలా ప్రకటిస్తారు ? నేనొక బౌద్ధుడిని. హిందువుని, ముస్లింను కాదు. అన్ని మతాలను గౌరవిస్తాను. ఈ అంశాన్ని మతపరమైన కోణంలో చూడొద్దు’’ అని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు ఓ ఉదాహరణను లోక్‌సభలో వివరించారు. ‘‘తమిళనాడులోని తిరుచిరాపల్లి జిల్లాలో ఉన్న ఓ గ్రామంలో 1,500 ఏళ్లనాటి సుందరేశ్వర ఆలయం ఉంది. అక్కడ ఒక వ్యక్తి తన ఆస్తిని విక్రయించడానికి వెళ్లి, తన ఊరంతా వక్ఫ్ బోర్డు పరిధిలో ఉందన్నాడు. మొత్తం ఊరంతా వక్ఫ్ ఆస్తి ఎలా అవుతుంది?’’ అని కేంద్ర మంత్రి ప్రశ్నించారు.
దురుద్దేశపూర్వకంగా కేంద్రం నిర్ణయాలు : కార్తీ చిదంబరం, ఎంపీ
కేంద్ర ప్రభుత్వం ప్రతీ నిర్ణయాన్ని దురుద్దేశపూర్వకంగా తీసుకుంటోందని కాంగ్రెస్ ఎంపీ కార్తీ చిదంబరం మండిపడ్డారు. మోడీ సర్కారు చిత్తశుద్ధితో ఏదీ చేయడం లేదనిపిస్తోందన్నారు. వక్ఫ్ బోర్డు సవరణ బిల్లును జేపీసీ ముందుకు పంపితే.. అదే అన్ని విషయాలను తేలుస్తుందన్నారు.
ఆ బిల్లు రాజ్యాంగ వ్యతిరేకం : శశిథరూర్, ఎంపీ
వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు రాజ్యాంగ వ్యతిరేకంగా ఉందని, అందుకే చాలామంది వ్యతిరేకిస్తున్నారని కాంగ్రెస్ సీనియర్ ఎంపీ శశిథరూర్ అన్నారు. జేపీసీలో చర్చ తర్వాతే మనం ఏదైనా కామెంట్ చేయగలుగుతామని ఆయన పేర్కొన్నారు.
ముస్లింల హక్కులను కాలరాసే యత్నం : మల్లురవి, ఎంపీ
కేంద్ర ప్రభుత్వం తప్పుడు ఉద్దేశాలతో ఈ బిల్లును తీసుకొచ్చిందని కాంగ్రెస్ ఎంపీ మల్లురవి ధ్వజమెత్తారు. ముస్లిం మైనారిటీలు, వారికి సంబంధించిన వక్ఫ్ కమిటీల హక్కులను కాలరాసేందుకు మోడీ సర్కారు యత్నిస్తోందన్నారు.
వక్ఫ్ ప్రాపర్టీ ఏయే రాష్ట్రంలో ఎంత ఉంది ?
మతపరమైన అవసరాల కోసం ముస్లింలు దానం చేసిన చరాస్తులు, స్థిరాస్తులను ‘వక్ఫ్’ ఆస్తులుగా పిలుస్తారు. డాక్యుమెంటేషన్ ప్రక్రియ ప్రారంభం కాకముందు నుంచే ఈ విధానం మనం దేశంలో ఉండేది. వక్ఫ్ ఆస్తిని ఇతరులకు బదిలీ చేయడానికి వీలు పడదు. వక్ఫ్ నుంచి వచ్చే ఆదాయాన్ని విద్యా సంస్థలు, శ్మశానవాటికలు, మసీదులు, షెల్టర్ హోమ్‌ల నిర్వహణకు ఉపయోగిస్తుంటారు. మన దేశంలో రక్షణ రంగం, రైల్వే శాఖ తర్వాత భారీగా ఆస్తులు వక్ఫ్ బోర్డుల పరిధిలోనే ఉన్నాయి. దేశవ్యాప్తంగా 8,72,324 వక్ఫ్ ఆస్తులు ఉన్నాయి. వీటిలో అత్యధికంగా ఉత్తరప్రదేశ్ (27 శాతం), బెంగాల్ (9 శాతం), తెలంగాణ (5 శాతం), పంజాబ్, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో ఉన్నాయి. తెలంగాణలోని వక్ఫ్ ఆస్తుల సంఖ్య 45,682. ఈ సమాచారాన్ని వక్ఫ్ బోర్డ్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ ఆఫ్ ఇండియా విడుదల చేసింది.