Priyanka Gandhi : మీ కోసం నా ఇల్లు, ఆఫీసు తెరిచే ఉంటాయి.. వయనాడ్ ఎంపీగా ప్రియాంక తొలి ప్రసంగం

by Hajipasha |   ( Updated:2024-11-30 10:55:23.0  )
Priyanka Gandhi : మీ కోసం నా ఇల్లు, ఆఫీసు తెరిచే ఉంటాయి.. వయనాడ్ ఎంపీగా ప్రియాంక తొలి ప్రసంగం
X

దిశ, నేషనల్ బ్యూరో : వయనాడ్ ప్రజల కోసం తన ఇల్లు, ఆఫీసు తలుపులు ఎల్లప్పుడూ తెరిచే ఉంటాయని లోక్‌సభ ఎంపీ ప్రియాంకాగాంధీ(Priyanka Gandhi) అన్నారు. స్థానికంగా ఏ సమస్య వచ్చినా తనను కలవాలని నియోజకవర్గ ప్రజలకు ఆమె సూచించారు. ఎంపీగా(Wayanad MP) ఎన్నికైన తర్వాత తొలిసారిగా ప్రియాంకాగాంధీ వయనాడ్‌లో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. శనివారం రోజు వయనాడ్‌లో నిర్వహించిన ర్యాలీలో ఆమె మాట్లాడారు. తనను ఎంపీగా ఎన్నుకున్నందుకు నియోజకవర్గ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. వయనాడ్ ప్రజానీకం సమస్యలను లోతుగా అర్థం చేసుకొని, వాటి పరిష్కారానికి శాయశక్తులా ప్రయత్నాలు చేస్తానని ప్రియాంక హామీ ఇచ్చారు. అవసరమైతే వయనాడ్ ప్రజల ఇళ్లకు వెళ్లి సమస్యలు తెలుసుకుంటానన్నారు. తనను గెలిపించినందుకు.. ప్రజలను అస్సలు నిరాశపర్చనని ఆమె స్పష్టం చేశారు. వయనాడ్‌లోని పలు ఏజెన్సీ ఏరియాల్లో మనుషులపై జంతువులు దాడి చేస్తున్న ఘటనలు ఆందోళన రేకెత్తిస్తున్న అంశం గురించి తనకు తెలుసున్నారు. తప్పకుండా వయనాడ్‌లోని వైద్య, విద్యా వసతులను మెరుగుపరుస్తానని ప్రియాంక తెలిపారు.

అదానీకి వేల కోట్లు.. వయనాడ్ ప్రజలకు మొండిచెయ్యి : రాహుల్

వయనాడ్‌(Wayanad) ప్రజలకు చాలా చేయాలని తమకు ఉందని.. అయితే కేరళలో అధికారంలో లేకపోవడంతో అంతస్థాయిలో అభివృద్ధి చేయలేకపోతున్నామని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌ గాంధీ పేర్కొన్నారు. అదానీ సంస్థలకు రూ.వేల కోట్ల ప్రయోజనం కలిగించిన ప్రధాని మోడీ.. వయనాడ్‌ ప్రజలను చిన్నచూపు చూస్తున్నారని మండిపడ్డారు. పారిశ్రామిక వేత్త అదానీపై అమెరికా ప్రభుత్వం అభియోగాలు మోపినా ప్రధాని మోడీ మాత్రం ఆయన్ని స్పెషల్‌గా చూస్తున్నారని విమర్శించారు. ప్రియాంకా గాంధీ గెలుపును పురస్కరించుకొని వయనాడ్‌లో నిర్వహించిన బహిరంగ సభలో రాహుల్ ప్రసంగించారు. అంతకుముందు వయనాడ్‌లో కొండచరియలు విరిగిపడిన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారికి రాహుల్‌, ప్రియాంక శ్రద్ధాంజలి ఘటించారు.

Advertisement

Next Story

Most Viewed