హాథ్రస్ ఘటన.. భోలే బాబాపై తొలి కేసు

by Hajipasha |
హాథ్రస్ ఘటన.. భోలే బాబాపై తొలి కేసు
X

దిశ, నేషనల్ బ్యూరో : ఎట్టకేలకు భోలే బాబాపై బిహార్‌లో కేసు నమోదైంది. జులై 2న ఉత్తరప్రదేశ్‌లోని హాథ్రస్ జిల్లా ఫూల్‌రాయ్‌ గ్రామంలో భోలే బాబా సత్సంగ్ కార్యక్రమం సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో 121 మంది చనిపోయారు. ఈ విషాద ఘటన చోటుచేసుకున్న నాలుగు రోజుల తర్వాత పాట్నా చీఫ్‌ జ్యుడీషియల్‌ మెజిస్ట్రేట్‌ కోర్టులో భోలే బాబాపై కేసు నమోదైంది. సత్సంగ్ కార్యక్రమంలో పాల్గొన్న భక్తులకు ఆధ్యాత్మిక ప్రవచనాలు చెప్పడం ముగియగానే భోలే బాబా వేదిక నుంచి దిగి బయలుదేరారు. ఈక్రమంలో బాబా పాద ధూళి కోసం భక్తులు పోటీపడ్డారు. ఈక్రమంలో జరిగిన తోపులాట, తొక్కిసలాటలో 121 మంది ప్రాణాలు కోల్పోయారు. భోలే బాబా భక్తులను వారించి ఉంటే అలా జరిగేది కాదనే వాదన వినిపిస్తోంది. ప్రమాద సమయంలో బాబా వేదిక వద్దే ఉన్నారని, భక్తులను భద్రతా సిబ్బంది తోసివేయడం వల్లే ఈ ప్రమాదం చోటుచేసుకుందని పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది.

ఘటనకు కారకులైన వారిని విడిచిపెట్టరు : భోలే బాబా

తాను సత్సంగ్ కార్యక్రమ వేదిక వద్ద నుంచి వెళ్లిపోయిన తర్వాతే తొక్కిసలాట జరిగిందని, ఈ ఘటన వెనుక సంఘ విద్రోహ శక్తుల హస్తం ఉండొచ్చని భోలే బాబా వాదిస్తున్నారు. తొలిసారిగా శనివారం రోజు వీడియో సందేశాన్ని విడుదల చేసిన భోలే బాబా.. తొక్కిసలాట ఘటన తనను తీవ్రంగా బాధపెట్టిందన్నారు. ఈ క్లిష్ట సమయంలో బాధను భరించే శక్తి ఆ భగవంతుడు ప్రసాదించాలని ప్రార్థిస్తున్నట్లు ఆయన చెప్పారు. ప్రభుత్వం, పాలనా యంత్రాంగంపై నమ్మకం ఉంచాలని బాధితులకు బాబా సూచించారు. ఘటనకు కారకులైన వారిని పోలీసులు విడిచిపెట్టరనే విశ్వాసం తనకు ఉందన్నారు. మరణించిన కుటుంబాలు, గాయపడిన వారికి అండగా ఉండాలని కమిటీ సభ్యులను ఆయన కోరారు.

కీలక నిందితుడికి 14 రోజుల రిమాండ్

ఫూల్‌రాయ్‌ గ్రామంలో భోలే బాబా తరఫున ఆధ్యాత్మిక ప్రవచన కార్యక్రమాన్ని నిర్వహించిన దేవప్రకాష్ మధుకర్‌ను శుక్రవారం రాత్రే హాథ్రస్ జిల్లా సికిందరావు పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం అతడిని మేజిస్ట్రేట్ కోర్టులో హాజరు పర్చగా 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి పంపుతూ ఆదేశాలు జారీ చేశారు. ఇదే కేసులో అరెస్టయిన మరో నిందితుడు సంజూ యాదవ్‌‌కు 14 రోజుల రిమాండ్ విధించారు. ఈ తొక్కిసలాట కేసులో అరెస్టయిన రాంప్రకాష్ షాక్యాను కూడా ఆదివారం కోర్టులో హాజరుపర్చనున్నారు.

Advertisement

Next Story

Most Viewed