అత్యాశపరులు దేశాన్ని విచ్ఛిన్నం చేయాలనుకుంటున్నారు: ప్రధాని మోడీ

by S Gopi |   ( Updated:2024-09-16 17:19:46.0  )
అత్యాశపరులు దేశాన్ని విచ్ఛిన్నం చేయాలనుకుంటున్నారు: ప్రధాని మోడీ
X

దిశ, నేషనల్ బ్యూరో: ప్రధాని నరేంద్ర మోడీ ప్రతిపక్షాలపై విమర్శలతో విరుచుకుపడ్డారు. ప్రతికూలత నిండిన వ్యక్తులు దేశ ఐక్యత, సమగ్రతలపై దాడి చేస్తున్నారని మండిపడ్డారు. అహ్మదాబాద్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడిన ప్రధాని మోడీ.. 'భారత్‌పై విశ్వాసం పెరిగినప్పుడు ఎగుమతులు పెరుగుతాయి. దేశంలోకి మరిన్ని పెట్టుబడులు వస్తాయి. భారత్‌పై నమ్మకం పెరిగినప్పుడు విదేశీ పెట్టుబడిదారులు తమ డబ్బును దేశంలో పెట్టుబడి పెడతారు. ముఖ్యంగా తయారీలో పెట్టుబడులు వస్తాయి. ఈ నేపథ్యంలో ఓవైపు దేశంలోని ప్రతి పౌరుడు ప్రపంచంలో భారత్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా మారాలని కోరుకుంటాడు. దేశాన్ని ముందుకు తీసుకెళ్లడంలో పౌరులు నిమగ్నమై ఉంటారు. మరోవైపు దేశంలో ప్రతికూలత నిండిన కొందరు ఇందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. వారు దేశ సమైక్యతపై దాడి చేస్తున్నారు. ఈ అత్యాశపరులు అధికారం కోసం దేశాన్ని ముక్కలుగా చేయాలనుకుంటున్నారు. జమ్మూకశ్మీర్‌లో ఆర్టికల్ 370ని తిరిగి తీసుకువస్తామని, జమ్మూకశ్మీర్‌లో రెండు రాజ్యాంగాలు, రెండు చట్టాల పాలనను మళ్లీ అమలు చేయాలని చెబుతున్నారు. కానీ, ఇలాంటి వ్యక్తులు దేశం పరువును తీయడానికి అన్ని అవవకాశాలను వెతుకుతున్నారు. అభివృద్ధి పథంలో పయనిస్తున్న భారత్ అలాంటి ప్రతికూల శక్తులపై గట్టిగా పోరాడుతోందని మోడీ వివరించారు.

‘దేశానికి స్వర్ణ కాలం’: ప్రధాని మోడీ

ప్రధాని మోడీ తన ప్రసంగంలో.. ప్రస్తుతం ఇది 'దేశానికి స్వర్ణ కాలం' అని అన్నారు. రాబోయే 25 ఏళ్లలో మనం దేశాన్ని అభివృద్ధి దశకు చేర్చాలి. ఈ లక్ష్యంలో గుజరాత్ కీలక పాత్ర పోషించనుంది. గుజరాత్ నేడు భారీ తయారీ కేంద్రంగా మారుతోంది. ఈ రాష్ట్రం దేశంలోనే అత్యంత కనెక్టివిటీ కలిగిన రాష్ట్రాలలో ఒకటిగా ఉంది. దేశంలో తయారు చేసిన మొట్టమొదటి రవాణా విమానం సీ295ని గుజరాత్ బహుమతిగా ఇచ్చే రోజు ఎంతో దూరంలో లేదని మోడీ పేర్కొన్నారు.

Advertisement

Next Story