PM Modi : భారత్‌‌పై జర్మనీ ‘విజన్ డాక్యుమెంట్’.. ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు

by Hajipasha |
PM Modi : భారత్‌‌పై జర్మనీ ‘విజన్ డాక్యుమెంట్’.. ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు
X

దిశ, నేషనల్ బ్యూరో : భారత్‌కు చెందిన స్కిల్డ్ ప్రొఫెషనల్స్‌కు ఏటా జారీ చేసే వీసాల సంఖ్యను 20వేల నుంచి 90వేలకు జర్మనీ పెంచిందని ప్రధానమంత్రి నరేంద్రమోడీ (Narendra Modi) వెల్లడించారు. భారతీయుల కోసం వీసాల జారీ ప్రక్రియను జర్మనీ సరళతరం చేయనుందన్నారు. భారత్-జర్మనీల స్నేహ బంధం చాలా బలంగా ఉందని ఆయన పేర్కొన్నారు. రాబోయే 25 ఏళ్లలో వికసిత భారత్ నిర్మాణానికి జర్మనీ తనవంతు సహకారాన్ని అందిస్తుందని మోడీ ఆశాభావం వ్యక్తం చేశారు. శుక్రవారం న్యూఢిల్లీలోని హైదరాబాద్ హౌస్‌లో ‘18వ ఆసియా-పసిఫిక్ సదస్సు : జర్మన్ బిజినెస్ 2024‌’ ను భారత ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రారంభించారు.

‘ఫోకస్ ఆన్ ఇండియా’ పేరుతో ఇటీవలే జర్మనీ ప్రభుత్వం విజన్ డాక్యుమెంట్‌ను విడుదల చేయడాన్ని మోడీ స్వాగతించారు. భారత ప్రొఫెషనల్స్ నైపుణ్యానికి జర్మనీ ఇస్తున్న ప్రాధాన్యతకు ఆ విజన్ డాక్యుమెంట్ అద్దం పడుతోందన్నారు. ప్రస్తుతం ఏటా రూ.2.50 లక్షల కోట్లు మేర ద్వైపాక్షిక వాణిజ్యాన్ని భారత్-జర్మనీలు చేస్తున్నాయని పేర్కొన్నారు. ఈనెల 26 వరకు జరగనున్న ఈ సదస్సు సందర్భంగా జర్మనీ ఛాన్స్‌లర్ ఒలాఫ్ షోల్జ్‌ (Olaf Scholz) తో భారత ప్రధాని భేటీ అయ్యారు. ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపై చర్చించారు.

Advertisement

Next Story

Most Viewed