Etela Rajender: ఇలాంటి మాటలు వారు నమ్ముతారని నేను అనుకోవడం లేదు

by Gantepaka Srikanth |
Etela Rajender: ఇలాంటి మాటలు వారు నమ్ముతారని నేను అనుకోవడం లేదు
X

దిశ, వెబ్‌డెస్క్: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల(Maharashtra Assembly Elections) ప్రచారం రసవత్తరంగా సాగుతోంది. గెలుపే లక్ష్యంగా బీజేపీ కూటమి, కాంగ్రెస్ కూటమిలు విస్తృతంగా ప్రచారం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర ప్రజలకు తెలంగాణ ఎంపీ ఈటల రాజేందర్(Etela Rajender) కీలక పిలుపునిచ్చారు. దేశ ప్రజలచే తిరస్కరించబడిన పార్టీ కాంగ్రెస్(Congress) అని అన్నారు. ఎన్ని అడ్డదారులైనా తొక్కి, అమలుకు సాధ్యం కాని హామీలు ఇచ్చి, అధికారమే పరమావధిగా కాంగ్రెస్ ప్రయత్నం ఉంటుందని కీలక వ్యాఖ్యలు చేశారు. హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో గ్యారంటీల పేరిట సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంకగాంధీ, ఖర్గేల చేత ప్రజాక్షేత్రంలో లక్షల మంది సమక్షంలో హామీలు ఇచ్చి అమలు చేయలేదని తెలిపారు. హిమాచల్ ప్రదేశ్ దివాలా తీసింది. కర్ణాటక చేతులెత్తేసింది.

తెలంగాణలో ఉచిత బస్సు తప్ప ఏ హామీ పూర్తిగా అమలు కాలేదని అన్నారు. ఇప్పుడు మహారాష్ట్రలోనూ అవే హామీలు ఇస్తున్నారని.. దయచేసి అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇప్పటికే ‘అమలుకు సాధ్యం కానీ హామీలు ఇవ్వకండి అభాసుపాలు కాకండి’ అని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు ఖర్గేనే స్వయంగా చెప్పే పరిస్థితి వచ్చిందని అన్నారు. దీనిని మేధావులు, ప్రజలు గమనించాలని సూచించారు. మహారాష్ట్ర ప్రజలు చైతన్యవంతమైన వారు ఇలాంటి ప్రలోభాలను నమ్ముతారని నేను అనుకోవడం లేదని అభిప్రాయపడ్డారు. మహారాష్ట్ర ప్రజానీకానికి కాంగ్రెస్ మోసాలు తెలియజేద్దాం.. ప్రజాస్వామ్యాన్ని బతికించుకుందామని పిలుపునిచ్చారు.

Advertisement

Next Story