Disaster: విపత్తు నివారణకు రూ.3028 కోట్లు.. ఆమోదం తెలిపిన కేంద్రం

by vinod kumar |
Disaster: విపత్తు నివారణకు రూ.3028 కోట్లు.. ఆమోదం తెలిపిన కేంద్రం
X

దిశ, నేషనల్ బ్యూరో: కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amith shah) నేతృత్వంలోని అత్యున్నత స్థాయి కమిటీ వివిధ రాష్ట్రాల్లో విపత్తు సహాయం కోసం 3027.86 కోట్ల రూపాయలను కేటాయించేందుకు ఆమోదించింది. 12 అత్యంత కరువు పీడిత రాష్ట్రాల్లోని 49 జిల్లాలకు సహాయాన్ని అందించేందుకు జాతీయ విపత్తు ఉపశమన నిధి (NDMF) నిధుల కోసం అందిన ప్రతిపాదనలను కూడా కమిటీ పరిశీలించింది. ఈ రాష్ట్రాలకు సహాయం చేయడానికి మొత్తం రూ. 2022.16 కోట్లతో ఆమోదించింది. ఇందులో కేంద్ర ప్రభుత్వ వాటా రూ.1200 కోట్లు ఉండగా.. ఈ రాష్ట్రాల్లో ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, బిహార్, గుజరాత్, జార్ఖండ్, కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా, రాజస్థాన్, తమిళనాడు, తెలంగాణ ఉన్నాయి. అంతేగాక 10 రాష్ట్రాల్లోని 50 జిల్లాల్లో పిడుగుపాటు ప్రమాదాన్ని తగ్గించేందుకు మెరుపు భద్రతపై ఉపశమన ప్రాజెక్ట్‌ను కమిటీ పరిగణించింది. అలాగే 19 రాష్ట్రాల్లోని 144 అధిక ప్రాధాన్యత గల జిల్లాలను లక్ష్యంగా చేసుకుని, మొత్తం రూ. 818.92 కోట్లతో అటవీ అగ్ని ప్రమాద నిర్వహణ కోసం ఒక పథకానికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందులో నేషనల్ డిజాస్టర్ మిటిగేషన్ ఫండ్ (ఎన్‌డీఎంఎఫ్), నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ (ఎన్డీఆర్‌ఎఫ్) కేంద్ర వాటా రూ.690.63 కోట్లుగా ఉంది. దేశంలో అటవీ అగ్ని ప్రమాదాల నిర్వహణ విధానాన్ని మార్చడమే ఈ ప్రాజెక్ట్ ప్రాథమిక లక్ష్యమని హోం మంత్రిత్వ శాఖ తన ప్రకటనలో తెలిపింది. కాగా,ఈ కమిటీలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ సభ్యులుగా ఉన్నారు.

Next Story

Most Viewed