Bomb Threats: వరుసగా రెండోరోజు ఢిల్లీలోని స్కూళ్లకు బెదిరింపులు

by Shamantha N |
Bomb Threats: వరుసగా రెండోరోజు ఢిల్లీలోని స్కూళ్లకు బెదిరింపులు
X

దిశ, నేషనల్ బ్యూరో: దేశ రాజధాని ఢిల్లీలోని పాఠశాలలకు(Delhi Schools) బాంబు బెదిరింపులు(Bomb Threats) వచ్చాయి. వరుసగా రెండో రోజు స్కూళ్లకు బెదిరింపులు రావడం గమనార్హం. ఆర్‌కే పురం ఢిల్లీ పబ్లిక్ స్కూల్, ర్యాన్ ఇంటర్నేషనల్ స్కూల్, వసంత్ కుంజ్ సహా పలు పాఠశాలలకు బెదిరింపు ఈ మెయిల్స్ వచ్చినట్లు పోలీసులు తెలిపారు. శనివారం ఉదయం 6:12 గంటలకు పాఠశాలలకు గ్రూప్ మెయిల్ వచ్చింది. బరీ అల్లా పేరుతో గ్రూప్ మెయిల్ వచ్చిందని పోలీసులు తెలిపారు. [email protected] నుంచి థ్రెట్ ఈ మెయిల్ వచ్చినట్లు వెల్లడించారు. సమాచారం అందుకున్న తర్వాత బాంబు డిటెక్షన్ టీమ్, అగ్నిమాపక అధికారులు తనిఖీలు చేపట్టారని వివరించారు. అయితే, అనుమానాస్పదంగా ఏమీ కనుక్కోలేదని తెలిపారు.

వారంలో మూడోసారి

మరోవైపు, ఈ వారంలో స్కూళ్లకు బెదిరింపులు రావడం ఇది మూడోసారి. శుక్రవారం కూడా ఢిల్లీలోని పలు పాఠశాలలకు బెదిరింపులు రావడం తీవ్ర కలకలం రేపింది. పశ్చిమ విహార్‌లోని ఢిల్లీ పబ్లిక్‌ స్కూల్‌, కేంబ్రిడ్జ్‌ పాఠశాల సహా పలు స్కూళ్లకు శుక్రవారం తెల్లవారుజామున బెదిరింపు (Bomb Threats to Schools) ఈ-మెయిల్స్‌ వచ్చాయి. అంతకుముందు, డిసెంబరు 9న కూడా 40కి పైగా స్కూళ్లకు ఇలాంటి బెదిరింపులే వచ్చాయి. పాఠశాల ఆవరణల్లో పేలుడు పదార్థాలను అమర్చామని, వాటిని పేల్చకుండా ఉండాలంటే 30 వేల డాలర్లు ఇవ్వాలని అగంతకులు బెదిరించారు. అయితే, అది ఫేక్ అని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఇకపోతే, ఈ ఏడాది ప్రారంభం నుంచే ఢిల్లీ, ఇతర ప్రాంతాల్లోని స్కూళ్లకు బాంబు బెదిరింపులు వచ్చాయి. ఇటీవలే, రోహిణి ప్రాంతంలోని ఓ సీఆర్పీఎఫ్‌ స్కూల్‌ బయట బాంబు పేలుడు చోటుచేసుకోవడం తీవ్ర కలకలం రేపింది.

Advertisement

Next Story