ఢిల్లీ కొత్త సీఎంగా అతిశీ పేరు ఖరారు

by karthikeya |   ( Updated:2024-09-17 09:07:44.0  )
ఢిల్లీ కొత్త సీఎంగా అతిశీ పేరు ఖరారు
X

దిశ, వెబ్‌డెస్క్: ఢిల్లీ కొత్త సీఎంగా ఆమ్ ఆద్మీ పార్టీ నేత, రాష్ట్ర జలవనరుల, విద్యాశాఖా మంత్రి అతిశి మర్లీనా బాధ్యతలు స్వీకరించబోతున్నారు. ఈ మేరకు ఆప్ వర్గాలు వెల్లడించాయి. మంగళవారం జరిగిన పార్టీ సమావేశంలో ప్రస్తుత ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ స్వయంగా సీఎం పదవి కోసం అతిశీ పేరును నామినేట్ చేసినట్లు తెలుస్తోంది. కాగా.. ఢిల్లీ సీఎంగా బాధ్యతలు స్వీకరించనున్న మూడవ మహిళా ముఖ్యమంత్రిగా అతిశీ రికార్డులకెక్కనున్నారు. ఇంతకుముందు సుష్మా స్వరాజ్, షీలా దీక్షిత్ ఢిల్లీ సీఎంగా బాధ్యతలు నిర్వర్తించారు. ఇదిలా ఉంటే మద్యం కుంభకోణంలో అరెస్టై ఈ మధ్యనే జైలు నుంచి బెయిల్‌పై బయటకొచ్చిన కేజ్రీవాల్.. తన సీఎం పదవికి రాజీనామా చేస్తానంటూ ప్రకటించడంతో కొత్త సీఎం ఎవరనే ప్రశ్న తెరపైకొచ్చింది. అయితే తాజాగా అతిశీని సీఎంగా నియమించబోతున్నట్లు కేజ్రీవాల్ నిర్ణయం తీసుకోవడంతో ఆ టెన్షన్‌కు తెరపడింది.

ఇక ఢిల్లీ ముఖ్యమంత్రిగా అతిశీ పేరు ఫైనల్ కావడం సర్‌ప్రైజ్ ఏమీ కాదనేది విశ్లేషకుల మాట. ఆమ్ ఆద్మీ పార్టీ కీలక నేతలంతా జైల్లో ఉన్నప్పుడు కూడా అతిశీ ధైర్యంగా పార్టీ గొంతును వినిపించారు. గత కొద్ది నెలలుగా ఆప్ పార్టీకి వెన్నెముకగా వ్యవహరించారు. ముఖ్యంగా ఢిల్లీలో నీటి ఎద్దడి ఏర్పడిన సమయంలో ఏకంగా ప్రధాని మోదీ విధానాలకు వ్యతిరేకంగా ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. అనేక ప్రజా వేదికలపై పార్టీ తరపున పివొటల్ రోల్ పోషించారు.

Advertisement

Next Story