Delhi elections: ఢిల్లీ ప్రజలపై హామీల వర్షం.. కాంగ్రెస్, ఆప్, బీజేపీ మేనిఫెస్టోలివే!

by vinod kumar |
Delhi elections: ఢిల్లీ ప్రజలపై హామీల వర్షం.. కాంగ్రెస్, ఆప్, బీజేపీ మేనిఫెస్టోలివే!
X

దిశ, నేషనల్ బ్యూరో: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలపై దేశ వ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. పోలింగ్ తేదీ దగ్గర పడుతున్న కొద్దీ ఇది మరింత ఎక్కువవుతోంది. ముచ్చటగా మూడో సారి అధికారం చేపట్టాలని ఆమ్ ఆద్మీ పార్టీ ఉవ్విళ్లూరుతుంటే, దేశ రాజధానిపై ఎలాగైనా పట్టుసాధించాలని బీజేపీ, కాంగ్రెస్ ప్రయత్నిస్తు్న్నాయి. ఇందులో భాగంగానే ఆ పార్టీ అగ్రనేతలంగా ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. అధికారంలోకి వస్తే ఏమి చేస్తామో చెబుతూనే ప్రత్యర్థులపై విమర్శలు గుప్పిస్తు్న్నారు. అంతేగాక ప్రజలను ఆకట్టుకునేందుకు హామీల పేరుతో మేనిఫెస్టోలు ప్రకటించి ముందుకు సాగుతున్నారు. దీంతో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. ఎన్నికల తేదీ దగ్గర పడుతుంటంతో ప్రధాన రాజకీయ పార్టీలన్నీ దాదాపు తమ మేనిఫెస్టోలను రిలీజ్ చేశాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్, ఆప్, బీజేపీల మేనిఫెస్టోలను ఓ సారి పరిశీలిద్దాం.

ఉచితాలవైపే మొగ్గు

ప్రధాన రాజకీయ పార్టీలన్నీ ప్రజలపై ఉచితాల వరాలు కురిపించాయి. ఉచిత హామీలతో ప్రజలకు చేరువయ్యేందుకు ప్రయత్నించాయి. మహిళలు, యువకులు, విద్యార్థులను ఆకట్టుకునేలా హామీలు గుప్పించారు. ఉచిత విద్య, వైద్యం, రవాణా సౌకర్యం, మహిళలకు నెలవారీ పెన్షన్ సహా అనేక ప్రకటనలు ఇచ్చారు. ఎన్నికల ప్రచారంలో పోటా పోటాగా దూసుకుపోయినట్టే మేనిఫెస్టోల ప్రకటనలోనూ ఒకరికి మించి మరొకరు ఉచితాలు ప్రకటించారు. 15 గ్యారెంటీలను ఆప్ ప్రకటించగా, సంకల్ప పత్ర పేరుతో మూడుసార్లు బీజేపీ తన హామీలను వెల్లడించింది. ఇక, కాంగ్రెస్ సైతం గ్యారంటీల పేరుతో ఢిల్లీ ప్రజలను ఆకర్షించే ప్రయత్నం చేసింది.

కాలుష్య సమస్యపై కనపడని ప్రణాళిక

ఢిల్లీలో కాలుష్యం ప్రధాన సమస్యగా ఉంది. శీతాకాలంలో ఈ సమస్య మరింత ఎక్కువవుతోంది. గాలి నాణ్యత తీవ్రంగా పడిపోవడంతో పాటు ప్రమాదకర స్థాయికి చేరుకుంటుంది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి నెలకొంటుంది. అడపా దడపా దీనిపై చర్యలు తీసుకున్నా వాటి వల్ల ఏ మాత్రం ఉపశమనం లభించడం లేదు. అయితే ప్రస్తుత ఎన్నికల్లో ఏ పార్టీ కూడా కాలుష్య నియంత్రణకు తీసుకునే చర్యలపై హామీ ఇవ్వకపోవడం గమనార్హం. పొల్యుషన్‌ను నివారించడానికి తీసుకునే చర్యలపై తమ మేనిఫెస్టోల్లో పెట్టలేదు. దీంతో ప్రధాన సమస్యలన్నీ పక్కదారి పడుతున్నాయని విశ్లేషకులు భావిస్తు్న్నారు. మరోవైపు యమునా నది నీటిని ప్రక్షాళన చేస్తాయని హామీ ఇచ్చినప్పటికీ దానికి సంబంధించిన ప్రణాళికలను మాత్రం వెల్లడించలేదు.

ఆప్ ప్రధాన హామీలు

- మహిళా సమ్మాన్ యోజన కింద మహిళలకు ప్రతీ నెల రూ.2,100 చెల్లింపు

- సంజీవని యోజన ద్వారా 60 ఏళ్లు పైబడిన వారికి ఉచిత వైద్య సేవలు

- ఉచిత విద్యుత్, నీరు

- వారానికి 24 గంటల పాటు స్వచ్ఛమైన తాగు నీటి సరఫరా

- యమునా నది ప్రక్షాళన

- డాక్టర్ బీఆర్ అంబేద్కర్ స్కాలర్ షిప్స్ (దళిత విద్యార్థుల విదేశీ విద్యకు సాయం)

- విద్యార్థులకు ఉచిత బస్సు ప్రయాణం, మెట్రోలో 50 శాతం రాయితీ

- పూజారులు, గురుద్వారాలోని గ్రంథీలకు నెలకు రూ.18,000 గౌరవ వేతనం

- ఆటో డ్రైవర్లు, ఈ-రిక్షా పుల్లర్లకు రూ.10 లక్షల జీవిత భీమా, రూ.5 లక్షల ప్రమాద భీమా.

- దళిత విద్యార్థులకు అంబేడ్కర్ స్కాలర్‌షిప్ పథకం

బీజేపీ మేనిఫెస్టోలోని కీలక అంశాలు

- యమునా నది ప్రక్షాళన

- సీనియర్ సిటిజన్లకు రూ.2,500 పెన్షన్

- మహిళలకు రూ.2,500 పెన్షన్

- రూ.500కే ఎల్‌పీజీ సిలిండర్‌

- వితంతువులు, నిరుపేద మహిళల పెన్షన్‌ను రూ.2,500 నుంచి రూ.3,000కు పెంపు

- ప్రతి గర్భిణికి రూ.21వేలు అందజేత

- నిరుపేద విద్యార్థులకు ఉచిత విద్య

- యువతకు పోటీ పరీక్షలకు రూ.15 వేల ఆర్థిక సాయం

- ఆటో-టాక్సీ డ్రైవర్లకు సంక్షేమ బోర్డు, రూ.10 లక్షల జీవిత బీమా,

- గృహ కార్మికులకు సంక్షేమ బోర్డు, రూ.10 లక్షల జీవిత బీమా

- 50,000 ప్రభుత్వ పోస్టుల భర్తీ

- ఢిల్లీ ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 33శాతం రిజర్వేషన్లు

- స్వయం సహాయక బృందాల్లో పనిచేసే మహిళలకు ₹1 లక్ష వరకు వడ్డీ లేని రుణాలు

కాంగ్రెస్ గ్యారంటీలు

- 300 యూనిట్ల ఉచిత విద్యుత్‌

- ప్యారీ దీదీ పథకం కింద మహిళలకు ప్రతినెలా రూ.2,500 ఆర్థికసాయం

- ‘అందరికీ ఆరోగ్యం’ పథకం కింద రూ.25లక్షల వరకు ఆరోగ్య బీమా

- రూ.500కే గ్యాస్ సిలిండర్, ఉచిత రేషన్ కిట్‌

- సీనియర్‌ సిటిజన్లు, వికలాంగులు, ట్రాన్స్‌జెండర్లకు నెలకు రూ.5వేల పెన్షన్‌

- షెడ్యూల్డ్ కులాలకు 15శాతం కాంట్రాక్టులు

- నిరుద్యోగ యువతకు రూ. 8,500 స్టైఫండ్

- వితంతువులు, వారి కుమార్తెలు, అనాథ బాలికల వివాహాలకు రూ.1.1 లక్ష

Next Story

Most Viewed