సంక్షేమ పథకాలు అమలు చేయాలని ఆదేశించలేం: సుప్రీంకోర్టు

by S Gopi |
సంక్షేమ పథకాలు అమలు చేయాలని ఆదేశించలేం: సుప్రీంకోర్టు
X

దిశ, నేషనల్ బ్యూరో: రాష్ట్ర ప్రభుత్వాలు అందించే సంక్షేమ పథకాల విషయంలో భారత అత్యున్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రభుత్వ విధానపరమైన విషయాలను పరిశీలించడంలో న్యాయస్థానాల పరిధి చాలా పరిమితంగా ఉంది. ఏ పథకమైనా బాగుంది, లేదని చెప్పే అధికారం కోర్టుకు లేదని అభిప్రాయపడింది. ఆకలి, పోషకాహార లోపాన్ని ఎదుర్కోవడానికి కమ్యూనిటీ కిచెన్‌ల ఏర్పాటుపై ఓ పథకాన్ని రూపొందించేలా రాష్ట్రాలకు ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై శుక్రవారం జస్టిస్ బేలా ఎం త్రివేది, జస్టిస్ పంకజ్ మిథాల్‌లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. జాతీయ ఆహార భద్రతా చట్టం, ఇతర సంక్షేమ పథకాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్నాయని, కమ్యూనిటీ కిచెన్‌ల ఏర్పాటుపై తాము ఎటువంటి ఆదేశాలివ్వలేమని పేర్కొంది. ప్రభుత్వం తెచ్చిన పాలసీకి సంబంధించి ఖచ్చితత్వం, సముచితత్వాన్ని పరిశీలించలేమని, అలాగే.. నిర్దిష్ట పథకాన్ని అమలు చేయాలనే ఆదేశాలను రాష్ట్రాలకు ఇవ్వలేమని వివరించింది. అంతేకాకుండా జాతీయ ఆహార భద్రతా చట్టం లక్ష్యాన్ని సాధించేందుకు కమ్యూనిటీ కిచెన్‌ల ఏర్పాటు భావన రాష్ట్రాలకు ఉత్తమమైన మార్గమా, కాదా అనే అంశాన్ని కూడా పరిశీలించలేమని పేర్కొంది. ప్రత్యామ్నాయ సంకేమ పథకాలు అమలు చేయాలన్న సూచనలు ఇస్తామని అభిప్రాయపడింది.


👉 Follow us on WhatsApp Channel
👉 Follow us on Sharechat


Next Story