'ఉరి శిక్ష' విధానంపై నిపుణుల కమిటీ.. సుప్రీంకు తెలిపిన కేంద్రం

by Vinod kumar |
ఉరి శిక్ష విధానంపై నిపుణుల కమిటీ.. సుప్రీంకు తెలిపిన కేంద్రం
X

న్యూఢిల్లీ: మరణశిక్ష పడిన ఖైదీలకు ప్రస్తుతం అమలు చేస్తున్న ఉరితీత పద్ధతిని పరిశీలించేందుకు నిపుణుల కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు సుప్రీం కోర్టుకు కేంద్ర ప్రభుత్వం మంగళవారం తెలిపింది. దీనిపై చర్చలు జరుగుతున్నాయని కేంద్రం తరఫున సుప్రీంకోర్టులో వాదనలు వినిపించిన అటార్నీ జనరల్ ఆర్. వెంకటరమణి వెల్లడించారు. మరణశిక్ష పడిన ఖైదీలను ఉరితీసే పద్ధతి సరైనదేనా..? ప్రత్యామ్నాయ పద్ధతులు ఉన్నాయా..? అనే అంశాల పరిశీలనకు నిపుణుల కమిటీ ఏర్పాటు అవసరమని సుప్రీం కోర్టు గతంలో చేసిన సూచనను కేంద్రం పరిగణలోకి తీసుకుందని చెప్పారు.

‘‘ప్రతిపాదిత నిపుణుల ప్యానెల్‌లో సభ్యులను ఎంపిక చేసేందుకు కొన్ని ప్రక్రియలు ఉంటాయి. ప్రస్తుతం దీనిపై చర్చలు జరుగుతున్నాయి. దీనిపై స్పందించేందుకు మరింత సమయం కావాలి’’ అని అటార్నీ జనరల్‌ తెలిపారు. ఇందుకు అంగీకరించిన సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డి. వై. చంద్రచూడ్‌ నేతృత్వంలోని ధర్మాసనం.. ఈ కేసులో తదుపరి విచారణ తేదీని వేసవి సెలవుల తర్వాత ప్రకటిస్తామని స్పష్టం చేసింది.

న్యాయవాది రిషి మల్హోత్రా పిటిషన్‌‌తో కదలిక..

దేశంలో మరణశిక్ష అమలులో ఉరితీసే పద్ధతికి ఉన్న రాజ్యాంగబద్ధతను సవాలు చేస్తూ న్యాయవాది రిషి మల్హోత్రా సుప్రీం కోర్టులో గతంలో పిటిషన్‌ దాఖలు చేశారు. అమెరికాలో ప్రాణాంతకమైన ఇంజక్షన్‌ ద్వారా అమలు చేస్తున్న మరణశిక్షతో పోలిస్తే ఉరి తీయడమనేది అత్యంత క్రూరమైన, దారుణమైన విధానమని పేర్కొన్నారు. దీనిపై ఈ ఏడాది మార్చిలో విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. ఉరిశిక్ష అమలుకు మానవీయ పద్ధతుల్లో ప్రత్యామ్నాయాలు ఉన్నాయనే అంశాలను పరిశీలించడానికి మరింత సమాచారం అవసరమని కేంద్రానికి సూచించింది. దీనిపై నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని ప్రతిపాదించింది. దీనికి స్పందనగానే కేంద్రం తాజా నిర్ణయం తీసుకుంది.

Advertisement

Next Story

Most Viewed