కాంగ్రెస్ ప్రజలను తప్పుదోవ పట్టిస్తోంది: రాహుల్ వ్యాఖ్యలపై ప్రధాని మోడీ ఫైర్

by samatah |
కాంగ్రెస్ ప్రజలను తప్పుదోవ పట్టిస్తోంది: రాహుల్ వ్యాఖ్యలపై ప్రధాని మోడీ ఫైర్
X

దిశ, నేషనల్ బ్యూరో: కాంగ్రెస్ ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ దేశాన్ని అస్థిరత వైపు తీసుకెళ్తుందని ప్రధాని నరేంద్ర మోడీ విమర్శించారు. ఉత్తరాఖండ్‌లో మంగళవారం నిర్వహించిన ఎన్నికల ప్రచార ర్యాలీలో మోడీ ప్రసంగించారు. దేశంలో మూడో సారి అధికారంలోకి వస్తే ఉచిత విద్యుత్ అందించేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. దేశాన్ని మరింత అభివృద్ధి దశలోకి తీసుకెళ్తామని చెప్పారు. దేశ భూమి ఉత్తరాఖండ్ పై బీజేపీకి ఉన్న ప్రేమ, ఆప్యాయత అందరికీ తెలుసన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఏ మాత్రం వెనకడుగు వేయలేదని తెలిపారు. 60ఏళ్లలో ఎంత అభివృద్ధి జరిగిందో ఈ పదేళ్లలో అంతకంటే రెట్టింపు అభివృద్ధి చేశామన్నారు.

మూడోసారి మోడీ ప్రభుత్వం వస్తే దేశం నిప్పులు కురుస్తుందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఇటీవల చేసిన వ్యాఖ్యలపై మోడీ స్పందించారు. ‘70ఏళ్ల పాటు దేశాన్ని పాలించి పదేళ్లు అధికారానికి దూరమైన వారు దేశంలో అగ్గి పెట్టడం గురించి మాట్లాడుతున్నారు. అలాంటి వాళ్లను గుర్తించి ఓడించండి’ అని తెలిపారు. ఇలాంటి భాష మాట్లాడటం సరైందేనా? దేశాన్ని తగలబెట్టేందుకు అనుమతిస్తారా అని ప్రశ్నించారు. ఇలాంటి వ్యాఖ్యలతో కాంగ్రెస్ దేశ ప్రజలను రెచ్చగొడుతోందని మండిపడ్డారు. మరోసారి బీజేపీని గెలిపిస్తే దేశాన్ని ప్రపంచలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు.

Advertisement

Next Story