- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రతిపక్షాలకు ‘పన్ను’ పోటు.. రెండు జాతీయ పార్టీలకు ఐటీ నోటీసులు
దిశ, నేషనల్ బ్యూరో : ఎన్నికలు సమీపించిన వేళ దేశంలోని ప్రధాన ప్రతిపక్ష పార్టీలు ‘పన్ను’ పోటుతో విలవిలలాడుతున్నాయి. ఆ పార్టీలపైనే ఇప్పుడు ఆదాయపు పన్ను(ఐటీ) శాఖ ప్రధాన ఫోకస్ పెట్టింది. తాజాగా గురువారం రోజు కాంగ్రెస్ పార్టీకి మరోసారి ఐటీ శాఖ డిమాండ్ నోటీసులు ఇచ్చింది. 2017-18, 2020-21 మదింపు సంవత్సరాలకు సంబంధించిన పెనాల్టీ, వడ్డీగా రూ.1823 కోట్లు కట్టాలని ఆదేశించింది. ఈ విషయాన్ని కాంగ్రెస్ నేత వివేక్ తన్ఖా శుక్రవారం మీడియాకు వెల్లడించారు. ఎలాంటి మదింపు ఉత్తర్వులు, పత్రాలు లేకుండానే ఐటీశాఖ తమకు నోటీసులు ఇచ్చిందని ఆయన తెలిపారు. ఇది అహేతుక, అప్రజాస్వామిక చర్య అని మండిపడ్డారు. ఎన్నికలు సమీపించిన ప్రస్తుత తరుణంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీని ఆర్థికంగా ఇబ్బందులకు గురిచేసే దురుద్దేశంతోనే ఐటీశాఖను కేంద్ర ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందని వివేక్ తన్ఖా ఆరోపించారు. దీన్ని తాము చట్టపరంగా సవాల్ చేస్తామని తెలిపారు.
వరుసగా రెండుసార్లు హైకోర్టులో ఎదురుదెబ్బ..
2017 సంవత్సరం నుంచి 2021 మధ్య కాలానికి సంబంధించిన కాంగ్రెస్ పార్టీ అకౌంట్ల లావాదేవీలు, పన్ను చెల్లింపులపై ఆదాయపు పన్ను విభాగం చేపట్టిన పునఃపరిశీలన ప్రక్రియను ఆపాలంటూ కాంగ్రెస్ దాఖలు చేసిన పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు గురువారం కొట్టేసింది. పునఃపరిశీలన ప్రక్రియను చేపట్టేందుకు అవసరమైన ఆధారాలు ఐటీ అధికారుల దగ్గర ఉన్నాయని, ఈ విషయంలో తాము జోక్యం చేసుకోలేమని హైకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ ఆదేశం వెలువడిన వెంటనే ఆయా సంవత్సరాలకు సంబంధించిన పన్ను బకాయిలు, పెనాల్టీ, వడ్డీగా రూ.1823 కోట్లు కట్టాలని ఐటీశాఖ నోటీసులు జారీ చేయడం గమనార్హం. అంతకుముందు 2014-15 నుంచి 2016-17 మధ్య కాలానికి సంబంధించి ఆదాయపు పన్ను శాఖ చేపట్టిన పునఃపరిశీలనను సవాల్ చేస్తూ కాంగ్రెస్ దాఖలు చేసిన పిటిషన్‌ను కూడా ఇవే కారణాలతో ఢిల్లీ హైకోర్టు తిరస్కరించింది. ఈ పునఃపరిశీలనకు సంబంధించి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ బ్యాంకు అకౌంట్ల నుంచి రూ.135 కోట్లను ఐటీశాఖ రికవర్ కూడా చేసింది.
కోర్టును ఆశ్రయిస్తాం : సీపీఐ
ఇండియా కూటమిలో ఉన్న కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (సీపీఐ)కి కూడా ఆదాయపు పన్నుశాఖ నోటీసులు జారీ చేసింది. పన్ను రిటర్నులు దాఖలు చేసేటప్పుడు పాత పాన్ కార్డును ఉపయోగించినందుకు వడ్డీతో సహా కలిపి బకాయిల కింద రూ.11 కోట్లు చెల్లించాలని నోటీసుల్లో పేర్కొంది. దీనిపై తాము న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని సీపీఐ వర్గాలు వెల్లడించాయి. న్యాయ సలహా కోసం న్యాయవాదులను సంప్రదిస్తున్నట్లు తెలిపాయి. ఇదిలా ఉండగా గడచిన 72 గంటల్లో తనకు ఐటీ శాఖ నుంచి 11 నోటీసులు అందాయని తృణమూల్ కాంగ్రెస్ నేత సాకేత్ గోఖలే శుక్రవారం వెల్లడించారు.
బీజేపీ నుంచి రూ.4600 కోట్లు వసూలు చేయాలి : కాంగ్రెస్
లోక్‌సభ ఎన్నికలకు ముందు విపక్ష పార్టీలను ఆర్థికంగా కుంగదీసేందుకే బీజేపీ ఇలాంటి కుటిల యత్నాలు చేస్తోందని కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ జైరాం రమేశ్, పార్టీ కోశాధికారి అజయ్ మాకెన్ అన్నారు. ఈ పన్ను ఉగ్రవాదాన్ని వెంటనే ఆపాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఐటీ శాఖ నుంచి కాంగ్రెస్ పార్టీకి వచ్చిన తాజా నోటీసుల వివరాలను వారు శుక్రవారం మీడియా సమావేశంలో వెల్లడించారు. ‘‘పన్ను చట్టాలను బీజేపీ తీవ్రంగా ఉల్లంఘిస్తోంది. అందుకు ఆ పార్టీ నుంచి రూ.4600 కోట్లు వసూలు చేయాలి. అసంబద్ధ కారణాలతో పాత రిటర్నులను తిరిగి తెరిచి కాంగ్రెస్ పార్టీపై ఐటీ శాఖ దుష్ప్రచారానికి పాల్పడుతోంది’’ అని అజయ్ మాకెన్ తెలిపారు. ఈ వ్యవహారంపై కాంగ్రెస్ పార్టీ సుప్రీం కోర్టును ఆశ్రయిస్తుందని ఆయన చెప్పారు.