Droupadi Murmu: రాజ్‌భవన్‌లతో సామాన్యుల అనుబంధాన్ని పెంచండి.. గవర్నర్లకు రాష్ట్రపతి పిలుపు

by Hajipasha |
Droupadi Murmu: రాజ్‌భవన్‌లతో సామాన్యుల అనుబంధాన్ని పెంచండి.. గవర్నర్లకు రాష్ట్రపతి పిలుపు
X

దిశ, నేషనల్ బ్యూరో : రాజ్‌భవన్‌లతో సామాన్య ప్రజల అనుబంధాన్ని పెంచేందుకు గవర్నర్లు కృషి చేయాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కోరారు. ఇప్పటికే చాలామంది గవర్నర్లు రాజ్‌భవన్‌లను ప్రజల కోసం తెరిచారని.. మిగతా గవర్నర్లు కూడా వారి బాటలోనే పయనించాలని సూచించారు. రాజ్‌భవన్‌లు సామాజిక, సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించడం ద్వారా ప్రజలకు మరింత చేరువ కావచ్చని ఆమె పేర్కొన్నారు. రాజ్‌భవన్‌ల వాతావరణం భారతీయ తత్వాన్ని ప్రతిబింబించేలా ఉండాలన్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆధ్వర్యంలో ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో జరిగిన రెండు రోజుల గవర్నర్ల సదస్సు శనివారంతో ముగిసింది. ఈ సదస్సు వేదికగా పరస్పర అభ్యాస స్ఫూర్తితో సమగ్ర చర్చలు జరిపినందుకు గవర్నర్ల సమష్టి కృషిని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న గవర్నర్‌లు తమ కార్యాలయ పనితీరును మెరుగుపర్చడంతో పాటు ప్రజల సంక్షేమం కోసం తమ విలువైన ఆలోచనలు, సూచనలతో ముందుకొచ్చారని ఆమె ప్రశంసించారు. వారి సూచనలు అమలు చేయబడతాయనే విశ్వాసాన్ని రాష్ట్రపతి వ్యక్తం చేశారు.

గిరిజనుల నిధుల వినియోగంపై ఫోకస్ పెట్టాలి

రాష్ట్రాలు, కేంద్రం కలిసికట్టుగా ముందుకుసాగితేనే దేశాభివృద్ధి వేగవంతం అవుతుందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. ఈక్రమంలో వారధిగా నిలవాల్సిన బాధ్యత గవర్నర్లపై ఉందని చెప్పారు. ప్రజా సంక్షేమ కార్యక్రమాల ప్రయోజనాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా చూడాలని గవర్నర్లను ఆమె కోరారు. తద్వారా సమ్మిళిత అభివృద్ధి లక్ష్యాన్ని దేశం సాధించగలుగుతుందన్నారు. గిరిజన వర్గాల సంక్షేమం కోసం కేటాయించిన వనరులను సక్రమంగా వినియోగిస్తున్నారా లేదా అనే దానిపై గవర్నర్లు ఫోకస్ పెట్టాలని కోరారు. మహిళా పారిశ్రామికవేత్తలు, మహిళా సాధికారత కోసం కృషి చేస్తున్న సంస్థల ప్రతినిధులతో ఎప్పటికప్పుడు సంభాషించి వారికి మార్గనిర్దేశం చేయాలని గవర్నర్‌లకు రాష్ట్రపతి సూచించారు. దేశ అభివృద్ధి ప్రక్రియలో ఎస్సీలు, ఎస్టీల భాగస్వామ్యాన్ని మరింత ప్రోత్సహించాలని కోరారు. పౌరులకు ఆదర్శంగా నిలవాల్సిన బాధ్యత గవర్నర్లపై ఉందన్నారు. ఎంతో ముఖ్యమైన అంశాలను ఈ సదస్సులో గవర్నర్లు చాలా వివరంగా చర్చించారని ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌కర్ పేర్కొన్నారు. ఇలాంటి చర్చల్లో పాల్గొనేందుకు గవర్నర్లు వెనుకాడకూడదని ఆయన తెలిపారు.

రసాయన రహితంగా రాజ్‌భవన్ క్యాంపస్‌లు

రాజ్‌భవన్‌లలో ఆదర్శవంతమైన పాలనా నమూనాను రూపొందించాలని గవర్నర్‌లను ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఈ సదస్సు సందర్భంగా కోరారు. రాజ్‌భవన్‌లు సమర్థవంతంగా పనిచేసేలా సిబ్బందికి నిరంతరం శిక్షణ అందించే ఏర్పాట్లు చేయాలన్నారు. గుజరాత్ గవర్నర్ ఆచార్య దేవవ్రత్ సూచించిన విధించగా.. అందరు ఇతర గవర్నర్‌లు రాజ్ భవన్‌లలో సహజ వ్యవసాయం నమూనాను అనుసరించాలని సూచించారు. వారి ప్రాంగణాలను రసాయన రహితంగా మార్చాలన్నారు. రాజ్‌భవన్‌లు ఇతరులకు ప్రేరణ, స్ఫూర్తిగా నిలిచేలా ఉండాలన్నారు. ఈ సదస్సులో పాల్గొన్న గవర్నర్ల బృందాలు సమర్పించిన నివేదికల్లోని అంశాలు బాగున్నాయని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా కితాబిచ్చారు. గవర్నర్ల పనితీరును మరింత ప్రభావవంతంగా చేయడానికి అన్ని చర్యలను తీసుకుంటామని ఆయన తెలిపారు.

Advertisement

Next Story