CM Vijayan: హేమ కమిటీ సిఫార్సులను పరిశీలిస్తున్నాం.. కేరళ సీఎం పినరయి విజయన్

by vinod kumar |   ( Updated:2024-08-20 19:22:48.0  )
CM Vijayan: హేమ కమిటీ సిఫార్సులను పరిశీలిస్తున్నాం.. కేరళ సీఎం పినరయి విజయన్
X

దిశ, నేషనల్ బ్యూరో: ట్రిబ్యునల్ ఏర్పాటు, సమగ్ర సినిమా చట్టాన్ని రూపొందించడపై జస్టిస్ హేమ కమిటీ చేసిన పలు సిఫార్సులను రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోందని కేరళ సీఎం పినరయి విజయన్ తెలిపారు. మంగళవారం ఆయన తిరువనంతపురంలో మీడియాతో మాట్లాడారు. సినీ పరిశ్రమలో మహిళలపై జరుగుతున్న వివిధ నేరాలపై కమిటీ సూచించిన చర్యలను ఇప్పటికే రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణకు బాధ్యత వహించే పలు ఏజెన్సీలు పరిశీలిస్తున్నాయని చెప్పారు. నేరస్థులపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. నివేదిక అందినప్పటికీ గత నాలుగేళ్లుగా ప్రభుత్వం మౌనం వహించడం సరికాదని ప్రతిపక్ష పార్టీలు తీవ్ర విమర్శలు చేసిన నేపథ్యంలో విజయన్ ఈ వ్యాఖ్యలు చేశారు. పినరయి విజయన్ ప్రభుత్వం నిస్సహాయ బాధితుల కంటే నిందితుల పక్షాన వ్యవహరిస్తోందని కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ ఆరోపించింది. ఈ నేపథ్యంలోనే విజయన్ పై వ్యాఖ్యలు చేశారు. అయితే ప్రతిపక్షాల ఆరోపణలను కొట్టి పారేసిన ఆయన ప్రభుత్వం బాధితులకు మద్దతు ఇస్తుందని, నిందితులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

కాగా, విమెన్ ఇన్ సినిమా కలెక్టివ్ డిమాండ్ మేరకు హైకోర్టు రిటైర్డ్ జస్టిస్ కె. హేమ, మాజీ నటి శారద, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి కేబీ వల్సల కుమారితో కూడిన త్రిసభ్య కమిటీని కేరళ ప్రభుత్వం గతంలో నియమించింది. అయితే ఐదేళ్ల క్రితమే నివేదిక అందజేసినా అందులోఉన్న వివరాలను కేరళ ప్రభుత్వం ఇటీవల విడుదల చేసింది. మళయాలీ సినీ పరిశ్రమలో 30 వేర్వేరు వర్గాల్లో పనిచేస్తున్న మహిళలు 17రకాల వేధింపులు ఎదుర్కొంటున్నారని కమిటీ గుర్తించింది. వాటిని నియంత్రించేందుకు పలు సిఫార్సులు సైతం చేసింది.

Advertisement

Next Story

Most Viewed