- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
Cm vijayan: కాంగ్రెస్ పార్టీ సెక్యులర్ ఓట్లను చీలుస్తోంది.. కేరళ సీఎం విజయన్ సంచలన వ్యాఖ్యలు

దిశ, నేషనల్ బ్యూరో: కేరళ సీఎం పినరయి విజయన్ (Pinarayi Vijayan) సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ (Congress party) సెక్యులర్ ఓట్లను చీల్చి ఇటీవలి ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించడానికి సహాయపడిందని ఆరోపించారు. ఢిల్లీ ఎన్నికల ఫలితాలే అందుకు నిదర్శనమని చెప్పారు. కొల్లంలో ప్రారంభమయ్యే సీపీఎం కేరళ రాష్ట్ర సమావేశానికి ముందు ఆయన చేసిన వ్యాఖ్యలు స్థానిక మీడియాతో ప్రచురితమయ్యాయి. కాషాయపార్టీని ఓడించగల ఇతర పార్టీలను కాంగ్రెస్ కలుపుకుని పోకపోతే ఢిల్లీ ఎన్నికల్లో కనిపించిన ఫలితం రాబోయే రెండేళ్లలో ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల్లోనూ పునరావృతమవుతుందన్నారు. ‘రాజస్థాన్, హర్యానా, పంజాబ్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో రైతు నిరసనలతో బీజేపీకి ఎదురుదెబ్బ తగిలింది. అయినప్పటికీ ఆ రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలోకి రావడానికి కాంగ్రెస్ విధానాలే దారితీశాయి. కాంగ్రెస్‌కు సెక్యులర్ ఓట్లను చీల్చింది. దీంతో బీజేపీ గెలుపునకు దారి తీసింది’ అని విజయన్ పేర్కొన్నారు.
ఢిల్లీలో గత రెండు అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలవకపోయినా, ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)ను ఓడించడమే లక్ష్యంగా కాంగ్రెస్ పని చేసిందని విమర్శించారు. బీజేపీని వ్యతిరేకించే ప్రాంతీయ పార్టీల పట్ల కాంగ్రెస్ అహంకారపూరితంగా వ్యవహరిస్తుందన్నారు. ‘కాంగ్రెస్‌కు ఆప్ నాయకత్వంతో విభేదాలు ఉండొచ్చు. కానీ వాటిని పరిష్కరించుకుని బీజేపీని ఓడించడానికి కలిసి పనిచేయాలి.లౌకిక పార్టీలు కాంగ్రెస్‌ను ఎలా విశ్వసించగలవు? ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ (IUML) వంటి పార్టీలు దీనిపై ఆలోచించాలి’ అని తెలిపారు.
విజయన్ వ్యాఖ్యలపై కేరళ అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు వీడీ సతీశన్ స్పందించారు. ఆయన వ్యాఖ్యలను తోసిపుచ్చారు. కాంగ్రెస్ తో చేతులు కలపడానికి ఆప్ నిరాకరించిందని అందుకే ఒక జాతీయ పార్టీగా కాంగ్రెస్ కూడా ఎన్నికల్లో పోటీ చేసిందని తెలిపారు. రాహుల్ గాంధీ బీజేపీతో ఎప్పడూ రాజీపడలేదని, సీఎపీఎంనే బీజేపీతో జతకట్టిందని ఆరోపించారు.