కేంద్ర హోం శాఖ కీలక నిర్ణయం: మయన్మార్‌తో ఆ ఒప్పందం రద్దు

by samatah |
కేంద్ర హోం శాఖ కీలక నిర్ణయం: మయన్మార్‌తో ఆ ఒప్పందం రద్దు
X

దిశ, నేషనల్ బ్యూరో: మయన్మార్‌లో ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో కేంద్ర హోం శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. భారత్-మయన్మార్ మధ్య ఉన్న ఫ్రీ మూమెంట్ రిజైమ్(స్వేచ్ఛా ఉద్యమ పాలన) ను రద్దు చేస్తున్నట్టు తెలిపింది. ఈ మేరకు హోం మంత్రి అమిత్ షా గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు. ‘దేశ సరిహద్దుల్ని సురక్షితంగా ఉంచాలనే మోడీ ఆదేశాల మేరకు భారత్ మయన్మార్ ఫ్రీ మూమెంట్ రిజైన్‌ను రద్దు చేస్తున్నాం. దేశ అంతర్గత భద్రత దృశ్యా ఈ నిర్ణయం తీసుకున్నాం. విదేశాంగ మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు తక్షణమే దీనిని అమలులోకి తీసుకొస్తున్నాం’ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. మయన్మార్ సరిహద్దు వెంబడి 1643 కిలోమీటర్ల మేర కంచె వేస్తామని ఇటీవల ప్రకటించిన అమిత్ షా..తాజా నిర్ణయం తీసుకోవడం గమనార్హం. కాగా, కుకీ, మెయితీ తెగల కారణంగా మణిపూర్‌లో అల్లర్లు జరుగుతున్న విషయం తెలిసిందే. మరోవైపు మిజోరం మాత్రం ఎఫ్‌ఎంఆర్‌ను తొలగింపు చర్యలను వ్యతిరేకిస్తున్నట్టు తెలిపింది.

ఫ్రీ మూమెంట్ రిజైమ్ అంటే?

ఫ్రీ మూమెంట్ రిజైమ్ అనేది భారత్ మయన్మార్ ల మధ్య ఉన్న ఒప్పందం. దీని ప్రకారం..వీసా, పాస్ పోర్టు లేకుండా ఇరు దేశాల మధ్య 16 కిలోమీటర్లు ప్రయాణం చేయొచ్చు. సరిహద్దుకు ఇరువైపులా ఉన్న బంధుత్వం, సామాజిక, జాతి సంబంధాలు కలిగిన తెగలు వారి కుటుంబాలను సందర్శించడానికి ఇరు దేశాల మధ్య ఈ అగ్రి మెంట్ కుదిరింది. 1970 నుంచి దీనిని అమలు చేస్తుండగా..2016లో మోడీ ప్రభుత్వం దీనిని పునరుద్దరించింది. అయితే మయన్మార్ నుంచి తిరుగుబాటుదారులు, అక్రమ వలసదారులు, మాదకద్రవ్యాల వ్యాపారులు ఈ విధానాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపణలు వచ్చాయి. దీంతో కేంద్ర ఈ అగ్రిమెంట్‌ను రద్దు చేసినట్టు సమాచారం. మయన్మార్‌తో మిజోరాం 510 కిలోమీట్లు, మణిపూర్ 390 కిలోమీటర్లు, అరుణాచల్ ప్రదేశ్ 520 , నాగాలాండ్ 215 కిలోమీటర్ల సరిహద్దును పంచుకుంటుంది.

Advertisement

Next Story