రెజ్లర్లపై కేసులు.. టెంట్లు, మంచాలు తొలగించిన పోలీసులు

by Harish |
రెజ్లర్లపై కేసులు.. టెంట్లు, మంచాలు తొలగించిన పోలీసులు
X

న్యూఢిల్లీ: నెల రోజులకు పైగా నిరసన ప్రదర్శన చేస్తున్న అంతర్జాతీయ రెజ్లర్లకు జంతర్ మంతర్ వద్ద ఇక అనుమతి ఇచ్చేది లేదని ఢిల్లీ పోలీసు డిప్యూటీ కమిషనర్ తెలిపారు. ఆదివారం రెజ్లర్లు పార్లమెంటుకు మార్చ్ నిర్వహించి నిబంధనలు ఉల్లంఘించారని, వారిపై కేసులు నమోదు చేసినట్లు చెప్పారు. రెజ్లర్లు మళ్లీ దరఖాస్తు చేసుకుంటే జంతర్ మంతర్ వద్ద కాకుండా మరోచోట నిరసన ప్రదర్శనకు అనుమతి ఇస్తామని సోమవారం ట్వీట్ చేశారు.

రెజ్లర్ల అరెస్టు.. మహిళల విడుదల

అయితే.. తాము చలో పార్లమెంట్ కార్యక్రమాన్ని శాంతియుతంగా నిర్వహించాలనుకున్నామని, పోలీసులే తమ పట్ల దురుసుగా ప్రవర్తించారని రెజ్లర్లు చెప్పారు. ‘‘వీడియోలో అన్నీ కనిపిస్తున్నాయి. ఒక రెజ్లర్ ను 20-30 మంది పోలీసులు చుట్టుముడితే మేము ఎలా ముందుకెళ్లగలం. మమ్మల్ని నెట్టేశారు. నేలపై పడేశారు. బలవంతంగా బస్సుల్లోకి లాగారు. మేము ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయలేదు. బ్యారికేడ్లను తొలగించలేదు. మమ్మల్ని ముందుకెళ్లనీయాలని వేడుకున్నా పోలీసులు కనికరించలేదు. పైగా మాపైనే కేసులు నమోదు చేశారు’ అని రెజ్లర్లు వినేష్ ఫొగట్, సాక్షి మాలిక్, బజరంగ్ పూనియా ఆవేదన వ్యక్తం చేశారు.

ఆదివారం జంతర్ మంతర్ వద్ద ముగ్గురు రెజ్లర్లు సహా 109 మందిని, ఢిల్లీ వ్యాప్తంగా 700 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు సాయంత్రం మహిళలను విడుదల చేశారు. రెజ్లర్లను అరెస్టు చేసిన తర్వాత జంతర్ మంతర్ వద్ద వాళ్లు వేసుకున్న మంచాలు, పరుపులు, కూలర్లు, ఫ్యాన్లు, టార్ఫాలిన్ టెంట్లను పోలీసులు తొలగించి నిరసన స్థలాన్ని క్లియర్ చేశారు.




దేశంలో ఇదేనా న్యాయం

ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన నెటిజన్లు దేశానికి ఒలింపిక్ పతకాలు తెచ్చిన అంతర్జాతీయ ఆటగాళ్ల పట్ల ఇలాగేనా ప్రవర్తించేది..? అని ప్రశ్నించారు. ఓ వైపు రెజ్లర్లపై పోలీసుల దురుసు ప్రవర్తన.. మరోవైపు పార్లమెంట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న భారత రెజ్లింగ్ ఫెడరేషన్ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ చిత్రాన్ని ప్రదర్శిస్తూ.. ‘దేశంలో ఇదేనా న్యాయం’ అని విమర్శించారు.




లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న బ్రిజ్ భూషణ్ ను అరెస్ట్ చేయాలంటూ రెజ్లర్లు నెల రోజులకు పైగా జంతర్ మంతర్ వద్ద నిరసన ప్రదర్శన చేస్తున్న విషయం తెలిసిందే. మరోవైపు.. పోలీసు వ్యాన్ లో రెజ్లర్లు నవ్వుతూ కూర్చున్నట్లున్న వీడియోను కొందరు ఎడిట్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేయడంపై బాధిత రెజ్లర్లు మండిపడ్డారు. ‘మన చిత్రాలను ఎంత దారుణంగా ఎడిట్ చేస్తున్నారో చూడండి. ఇలాంటి పనులు చేసే వారికి సిగ్గు లేదు. దేవుడు ఇలాంటి మనుషులను ఎలా తయారు చేస్తాడో నమ్మలేకపోతున్నాను. వారు హృదయం లేని వ్యక్తులు’ అని సాక్షి మాలిక్ ఆవేదన వ్యక్తం చేశారు.

Advertisement

Next Story

Most Viewed