BREAKING: ఓవర్ టూ ఢిల్లీ హైకోర్ట్.. అరెస్టును సవాలు చేస్తూ కేజ్రీవాల్ పిటిషన్ దాఖలు

by Shiva |
BREAKING: ఓవర్ టూ ఢిల్లీ హైకోర్ట్.. అరెస్టును సవాలు చేస్తూ కేజ్రీవాల్ పిటిషన్ దాఖలు
X

దిశ, వెబ్‌డెస్క్: లిక్కర్ స్కాం కేసులో అరెస్టైన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ హైకోర్టును ఆశ్రయించారు. ఈడీ తనను అరెస్ట్‌ చేయడాన్ని సవాలు చేస్తూ ఆయన తరఫు న్యాయవాది అభిషేక్ మను సంఘ్వీ ఇవాళ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై అత్యవసరంగా విచారణ జరపాలని కోరారు. ప్రస్తుతం సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆరు రోజుల పాటు ఈడీ అధికారుల కస్టడీలో ఉన్న విషయం అందరికీ తెలిసిందే.

కాగా, ఈడీ గురువారం రాత్రి కేజ్రీవాల్‌ను అరెస్ట్ చేయగానే అప్పటికప్పుడు అమ్ అద్మీ పార్టీ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ఈ కేసు విచారణ తక్షణం చేపట్టాలని కూడా కోరింది. అయితే, కేజ్రీవాల్ ఈడీ రిమాండ్‌ను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నందున పిటిషన్‌ను విత్‌డ్రా చేసుకుంటున్నట్లు ఆయన తరఫు న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నాకు తెలిపారు. సుప్రీం కోర్టు ప్రత్యేక బెంచ్ ఈ కేసును విచారించాల్సి ఉంది. ఈ బెంచ్‌లో జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ ఎంఎం సుందరేశ్, జస్టిస్ బేలా త్రివేది ఉన్నారు.

కేజ్రీవాల్ దిగువ న్యాయస్థానంలో రిమాండ్‌ను ఎదుర్కొంటారని, అవసరమైతే సుప్రీం కోర్టును మరో పిటిషన్‌తో ఆశ్రయిస్తారని అభిషేక్ మనుసింఘ్వీ ఈ కేసు విచారణకు రాకముందే జస్టిస్ సంజీవ్ ఖన్నాకు నివేదించినట్టు పీటీఐ వార్తా సంస్థ తెలిపింది. దిగువ కోర్టులో శుక్రవారం నాడు కేజ్రీవాల్ రిమాండ్ కేసు వినాల్సి ఉందని, అదే సమయంలో సుప్రీం కోర్టు కూడా ఈ కేసు విచారణకు స్వీకరించినందున, కేజ్రీవాల్ సుప్రీంలో వేసిన పిటిషన్‌ను ఉపసంహరించుకోవడానికి అవకాశం ఇవ్వాలని కోరారు.

Advertisement

Next Story