బీజేపీ వీడ్కోలు బడ్జెట్.. విపక్ష నేతల విమర్శనాస్త్రాలివీ

by Hajipasha |
బీజేపీ వీడ్కోలు బడ్జెట్.. విపక్ష నేతల విమర్శనాస్త్రాలివీ
X

దిశ, నేషనల్ బ్యూరో : కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్‌‌పై విపక్షాలు విమర్శలు గుప్పించాయి. ఇది కాషాయ పార్టీ ‘వీడ్కోలు బడ్జెట్’ అని సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ మండిపడ్డారు. ‘‘దేశ అభివృద్ధి కోసం పనికిరాని బడ్జెట్ ఇది.. ప్రజల బాగు కోసం పనికిరాని అభివృద్ధి ఎందుకు ? అలాంటి బడ్జెట్ ఎందుకు? ’’ అని ఆయన ధ్వజమెత్తారు. బీజేపీ ప్రభుత్వం దశాబ్ద కాలం పాటు ప్రజావ్యతిరేక బడ్జెట్‌లను ప్రవేశపెట్టి సిగ్గుమాలిన రికార్డును సృష్టించిందని అఖిలేష్ వ్యాఖ్యానించారు. ఈమేరకు ఆయన ట్విట్టర్‌లో ఒక పోస్ట్ చేశారు.

ఇది బడ్జెట్‌లా కనిపించడం లేదు : కార్తీ చిదంబరం, కాంగ్రెస్

బడ్జెట్‌పై కాంగ్రెస్ ఎంపీ కార్తీ చిదంబరం మాట్లాడుతూ.. ‘‘సార్వత్రిక ఎన్నికల తర్వాత కొత్త పార్లమెంట్ ఏర్పడే వరకు భారత ప్రభుత్వం తన సాధారణ కార్యకలాపాలను కొనసాగించడానికి అవసరమైన నిధులను కలిగి ఉండేలా చూసుకోవడమనేది పరిపాలనాపరమైన కసరత్తు. ఇది బడ్జెట్‌లా కనిపించడం లేదు’’ అని పేర్కొన్నారు. ‘‘కేంద్ర ఆర్థిక మంత్రి బడ్జెట్ ప్రసంగంలో ప్రభుత్వంపై ప్రశంసలు తప్ప ఇంకేం వినిపించలేదు’’ అని చెప్పారు.

అందమైన పదాలతో షో చేశారు : శశిథరూర్, కాంగ్రెస్

కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ మాట్లాడుతూ.. ‘‘బడ్జెట్‌ ప్రసంగంలో అందమైన పదాలను వాడారే తప్ప ప్రజలను ఆనందింపజేసే విషయాలను ప్రస్తావించలేదు. అమలు చేయలేని మాటలు చాలా చెప్పారు. మొత్తం మీద కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల ప్రసంగం నిరాశపర్చింది’’ అని తెలిపారు. ‘‘విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల గురించి ప్రసంగంలో ఆర్థికమంత్రి ప్రస్తావించారు.. కానీ అవి గణనీయంగా తగ్గిపోయాయనే విషయాన్ని చెప్పలేదు. ఆమె చేసిన ప్రకటనలకు వాస్తవిక గణాంకాలకు చాలా తేడాలు ఉన్నాయి’’ అని పేర్కొన్నారు. అతి చిన్న బడ్జెట్‌ ప్రసంగాల్లో ఇదొకటన్నారు.

సిసలైన బడ్జెట్ జూలైలోనే : ఫరూక్ అబ్దుల్లా, నేషనల్ కాన్ఫరెన్స్

నేషనల్ కాన్ఫరెన్స్ ఎంపీ ఫరూక్ అబ్దుల్లా మాట్లాడుతూ.. ‘‘ఇది అసలు బడ్జెట్ కాదు. సిసలైన బడ్జెట్ జూలైలో వస్తుంది. దాని ద్వారా పర్యాటకం, పరిశ్రమలు వృద్ధి చెందుతాయి. పరిశ్రమలు కూడా పెరుగుతాయి. దేశం అభివృద్ధి చెందుతుంది’’ అని చెప్పారు.

Advertisement

Next Story

Most Viewed