Biren: మణిపూర్ ప్రజలకు సేవ చేయడం గౌరవంగా భావిస్తున్నా.. రాజీనామా తర్వాత బిరేన్ సింగ్ వ్యాఖ్యలు

by vinod kumar |
Biren: మణిపూర్ ప్రజలకు సేవ చేయడం గౌరవంగా భావిస్తున్నా.. రాజీనామా తర్వాత బిరేన్ సింగ్ వ్యాఖ్యలు
X

దిశ, నేషనల్ బ్యూరో: మణిపూర్ సీఎం బిరేన్ సింగ్ (Biren singh) తన పదవికి ఆదివారం రిజైన్ చేశారు. రాష్ట్ర రాజధాని ఇంఫాల్‌లోని రాజభవన్‌లో గవర్నర్ అజయ్ కుమార్ భల్లాను కలిసి రాజీనామా లేఖ అందజేశారు. ఆయనతో పాటు రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు శారద, బీజేపీ ఈశాన్య మణిపూర్ ఇన్‌చార్జి సంబిత్ పాత్ర సుమారు 19 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ‘మణిపూర్ ప్రజలకు సేవ చేయడం ఎంతో గౌరవంగా ఉంది. రాష్ట్రంలోని ప్రతీ పౌరుడి ప్రయోజనాలను కాపాడటానికి సకాలంలో చర్యలు తీసుకోవడం, అభివృద్ధి పనులు, వివిధ ప్రాజెక్టుల అమలుకు సహకరించిన కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు. ఈ విధంగా పనిచేయడం కొనసాగించాలి’ పేర్కొన్నారు. రాజీనామాకు ముందు బిరేన్ సింగ్ ఉదయం ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో బీరేన్ సింగ్ భేటీ అయ్యారు. అక్కడి నుంచి మణిపూర్ కు వచ్చిన వెంటనే రిజైన్ చేశారు.

21 నెలలుగా రాష్ట్రంలో హింసాత్మక పరిస్థితులు నెలకొన్నాయి. కుకీ, మైతీ తెగల మధ్య నెలకొన్ని ఘర్షణ తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. దీని కారణంగా రాష్ట్రంలో 250 మందికి పైగా మరణించగా అనేక మంది నిరాశ్రయులయ్యారు. దీంతో ప్రతిపక్ష పార్టీలు ఈ అంశంపై ప్రభుత్వాన్ని నిరంతరం విమర్శిస్తున్నాయి. ఈ క్రమంలోనే బిరేన్ సింగ్ తీవ్ర ఒత్తిడికి గురయ్యారు. గతంలోనే ఆయన రాజీనామా చేస్తారని కథనాలు వెలువడ్డా వాటిని ఆయన కొట్టి పారేశారు. అయితే రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాల్లో ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాలని కాంగ్రెస్ పార్టీ భావించింది. ఈ నేపథ్యంలోనే బిరేన్ సింగ్ రాజీనామా చేయడం గమనార్హం. రెండు మూడు రోజుల్లో కొత్త సీఎం ఎంపిక జరగనుంది. అప్పటి వరకు బిరేన్ సింగ్ తాత్కాలిక సీఎంగా ఉండనున్నారు.

బిరేన్ సింగ్ విభజనను ప్రేరేపించారు: రాహుల్ గాంధీ

బిరేన్ సింగ్ రాజీనామా చేయడంపై లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ స్పందించారు. ‘దాదాపు రెండేళ్లుగా బిరేన్ సింగ్ మణిపూర్‌లో విభజనను ప్రేరేపించారు. హింస, ప్రాణనష్టంతో భారతదేశం అనే భావన నాశనం అయినప్పటికీ ప్రధాని మోడీ ఆయనను కొనసాగడానికి అనుమతించారు. తాజాగా పెరుగుతున్న ఒత్తిడి నేపథ్యంలోనే రిజైన్ చేశారు. ఇప్పటికైనా మోడీ స్పందించి మణిపూర్‌ను సందర్శించాలి. రాష్ట్రంలో సాధారణ స్థితి తీసుకురావాలి’ అని పేర్కొన్నారు.

Next Story

Most Viewed