ఆప్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఊరట.. ప్రజాస్వామ్య విజయమన్న కేజ్రీవాల్

by Vinod kumar |
ఆప్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఊరట.. ప్రజాస్వామ్య విజయమన్న కేజ్రీవాల్
X

న్యూఢిల్లీ: మేయర్ ఎన్నిక పదే పదే వాయిదా పడుతున్న క్రమంలో సుప్రీంకోర్టు ఆప్ ప్రభుత్వానికి ఊరటనిచ్చే విషయాన్ని చెప్పింది. ఢిల్లీ పాలక సంస్థ మేయర్ ఎన్నికల్లో నామినేటెడ్ సభ్యులు ఓటు వేయొద్దని శుక్రవారం తెలిపింది. అంతేకాకుండా కొత్తగా ఎన్నికైన మేయర్ ప్రిసైడింగ్ అధికారిగా వ్యవహరిస్తూ డిప్యూటీ మేయర్‌తో పాటు ఆరుగురు సభ్యులతో కూడిన స్టాండింగ్ కమిటీని ఎన్నుకోవాలని పేర్కొంది.

ఈ ఎన్నికల్లో కూడా నామినేటెడ్ సభ్యులకు ఓటు వేసే హక్కు లేదని స్పష్టం చేసింది. ఒకసారి ఎన్నికైన మేయర్ సమావేశాలను నిర్వహిస్తారని నొక్కి చెప్పాల్సిన అవసరం ఉందని సీజేఐ డీవై చంద్రచూడ్ చెప్పారు. 24 గంటల్లో ఎన్నికకు సంబంధించి నోటిఫికేషన్ ఇవ్వాలని ఆదేశించారు. గతేడాది డిసెంబర్‌లో మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వెలువడిన సంగతి తెలిసిందే. ఆప్ అత్యధికంగా 134 స్థానాల్లో గెలుపొందగా, ఆ తర్వాత బీజేపీ 104 సీట్లతో రెండో స్థానంలో నిలిచింది.

ఈ క్రమంలో ఇప్పటికే జరగాల్సిన మేయర్ ఎన్నిక ఇరుపక్షాల నిరసనలతో మూడు సార్లు వాయిదా పడింది. దీంతో ఆప్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. తాజా తీర్పుతో కేజ్రీవాల్ ప్రభుత్వానికి ఊరట లభించింది. కాగా, ఢిల్లీ మున్సిపల్ చట్టం ప్రకారం కూడా నామినేటెడ్ సభ్యులు ఓటు వేసేందుకు అనర్హులు. అయితే గవర్నర్ అర్హత కల్పిస్తూ ఆదేశాలు చేయడంతో వివాదానికి దారి తీసింది. మరోవైపు సుప్రీంకోర్టు వ్యాఖ్యలపై ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ హర్షించారు. ఇది ప్రజాస్వామ్య విజయమని ట్వీట్ చేశారు. రెండు నెలల తర్వాత ఢిల్లీ కి మేయర్ లభించనున్నారని తెలిపారు.

Advertisement

Next Story