Ayodhya : 2025 సెప్టెంబరుకల్లా అయోధ్య రామమందిరం పనులు పూర్తి

by Hajipasha |
Ayodhya : 2025 సెప్టెంబరుకల్లా అయోధ్య రామమందిరం పనులు పూర్తి
X

దిశ, నేషనల్ బ్యూరో : అయోధ్య రామమందిర(Ayodhya Ram temple) నిర్మాణ పనులు మూడు నెలలు ఆలస్యంగా పూర్తికానున్నాయి. 2025 జూన్ నాటికి పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ.. కూలీల కొరత కారణంగా అది సాధ్యమయ్యే అవకాశాలు లేవని ఆలయ నిర్మాణ కమిటీ ఛైర్మన్ నృపేంద్ర మిశ్రా(Nripendra Misra) వెల్లడించారు. అవసరమైన దాని కంటే 200 మంది తక్కువ కూలీలతో ప్రస్తుతం పనులు జరుగుతున్నాయన్నారు. ఈనేపథ్యంలో 2025 సెప్టెంబరు నాటికి రామమందిరం పనులన్నీ పూర్తయ్యే అవకాశం ఉందని ఆయన తెలిపారు. ‘‘రామమందిరం మొదటి అంతస్తులోని కొన్ని రాళ్లు పలుచగా, బలహీనంగా ఉన్నాయి. కట్టడం మన్నిక కోసం.. వాటిని కొత్త రాళ్లతో రీప్లేస్ చేయించాలని ఆలయ నిర్మాణ కమిటీ యోచిస్తోంది’’ అని నృపేంద్ర మిశ్రా చెప్పారు.

రామ మందిరానికి సరిహద్దు గోడ నిర్మాణం కోసం దాదాపు 8.5 లక్షల క్యూబిక్ ఫీట్ల ‘రెడ్ బన్సీ పహార్‌‌పూర్’ రాళ్లను తెప్పించామన్నారు. అయితే కూలీల కొరత కారణంగా వెంటనే ఆ పనులను మొదలుపెట్టలేక పోతున్నట్లు ఆయన తెలిపారు. ఇటీవలే జరిగిన ఆలయ నిర్మాణ కమిటీ సమావేశంలో ఆడిటోరియం, సరిహద్దు గోడ, ప్రదక్షిణ మార్గం నిర్మాణ పనులపై సమీక్షించామన్నారు. అయోధ్య(Ayodhya) రాముడి గర్భగుడితో పాటు మందిరం ప్రాంగణంలోని ఆరు ఆలయాల్లో ఏర్పాటు చేయాల్సిన పలు విగ్రహాలు రాజస్థాన్‌లోని జైపూర్‌లో తయారవుతున్నాయని.. అవి డిసెంబరుకల్లా అయోధ్యకు చేరుతాయని నృపేంద్ర మిశ్రా వెల్లడించారు. ఆయా విగ్రహాల ఎంపిక, అమరికలపై తదుపరిగా నిర్ణయం తీసుకుంటామన్నారు.

Advertisement

Next Story

Most Viewed