Modi 3.0: అంతర్గత భద్రత కోసం కృషి చేశాం.. వందరోజుల పనితీరుపై అమిత్ షా కామెంట్స్

by Shamantha N |
Modi 3.0: అంతర్గత భద్రత కోసం కృషి చేశాం.. వందరోజుల పనితీరుపై అమిత్ షా కామెంట్స్
X

దిశ, నేషనల్ బ్యూరో: ప్రధాని మోడీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చి 100 రోజులు పూర్తి చేసుకుంది. ఈసందర్భంగా వంద రోజుల నివేదికను కేంద్ర హోంమంత్రి అమిత్ షా విడుదల చేశారు. గత పదేళ్లలో దేశ అంతర్గత భద్రతకు ఎన్డీఏ ప్రభుత్వం తీవ్రంగా కృషి చేసిందని అన్నారు. భారత్‌లో మెరుగైన రాజకీయ స్థిరత్వం ఉందని గుర్తుచేశారు. ఎన్డీఏ ప్రభుత్వంలో దేశం అభివృద్ధి పథంలో దూసుకుపోతుందని మీడియాతో మాట్లాడారు. అభివృద్ధి చెందిన భారత్‌ను నిర్మించాలనే లక్ష్యంతోనే పనిచేస్తున్నామన్నారు. దేశంలో దశాబ్దానికి ఒకసారి చేపట్టే జనగణనను త్వరలో నిర్వహిస్తామని ప్రకటించారు. పూర్తివివరాలను త్వరలోనే వెల్లడిస్తామన్నారు. మోడీ 3.0 ప్రభుత్వంలో 11లక్షల మంది లఖ్‌పతి దీదీ పథకం కింద లబ్ధి పొందారని అమిత్ షా ప్రకటించారు. మోడీ నాయకత్వంలోనే విద్యావిధానంలో మార్పులు తెచ్చామన్నారు. కొత్త విద్యావిధానంతో ప్రాంతీయ భాషలను గౌరవిస్తున్నామనేది తెలుస్తుందన్నారు. మూడోసారి అధికారంలోకి వచ్చాక మౌలిక సదుపాయాల కోసం రూ.3 లక్షల కోట్లు కేటాయించినట్లు వెల్లడించారు.

రూ.15 లక్షల కోట్ల ప్రాజెక్టులకు ఆమోదం

జులై నుంచి రూ. 15 లక్షల కోట్లు విలువైన ప్రాజెక్టులకు ఆమోదం తెలిపామని అమిత్ షా అన్నారు. వారణాసి, బాగ్‌డోగ్రా, బిహార్ విమానాశ్రయాలలో కొత్త ఎయిర్‌స్ట్రిప్‌లు నిర్మించనున్నట్లు తెలిపారు. బెంగళూర్ మెట్రోని విస్తరించినట్లు వెల్లడించారు. కనీస మద్దతు ధర పెంచామని, యూపీఏ ప్రభుత్వం కంటే ఎన్నో రెట్లు ఎక్కువ మద్దతు ధరతో పంటల్ని కొనుగోలు చేశామని చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో 2 కోట్లు, పట్టణ ప్రాంతాల్లో కోటి ఇళ్లు నిర్మించాలని కొత్త లక్ష్యాన్ని నిర్దేశించుకున్నట్లు తెలిపారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో 12 పారిశ్రామికవాడలు ఏర్పాటు చేయడంతో పాటు ముద్రా రుణాన్ని రూ. 10 లక్షల నుంచి రూ. 20 లక్షలకు పెంచిన విషయాన్ని గుర్తు చేశారు. యువతకు నేరుగా ప్రయోజనం చేకూర్చే 2 లక్షల కోట్ల రూపాయల ప్రధానమంత్రి ప్యాకేజీని ప్రకటించాం. దీంతో యువతకు కొత్త ఉపాధి అవకాశాలు ఏర్పడతాయని చెప్పారు. ప్రధానమంత్రి సూర్య ఘర్ యోజన ద్వారా ఇళ్లకు సౌరశక్తి అందుతోందన్నారు. పీఎం ఈ-బస్ సర్వీస్ ప్రారంభమైందని, స్టార్టప్స్‌పై 31 శాతం అనవసర పన్ను తొలగించామని చెప్పారు. ఇక, దేశానికి నాయకత్వం వహించేలా ఎన్డీఏకు మరో అవకాశం ఇచ్చినందుకు ఈసందర్భంగా ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేశారు.

Advertisement

Next Story

Most Viewed