J&K: ఈ ఏడాది జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాద దాడుల్లో 28 మంది మృతి

by S Gopi |
J&K: ఈ ఏడాది జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాద దాడుల్లో 28 మంది మృతి
X

దిశ, నేషనల్ బ్యూరో: జమ్మూకశ్మీర్‌లో ఈ ఏడాది జూలై 21వ తేదీ వరకు 11 ఉగ్రవాదు దాడులు, 24 ఎన్‌కౌంటర్లు జరిగాయని కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ(ఎంహెచ్ఏ) మంగళవారం లోక్‌సభకు తెలియజేసింది. ఈ ఘటనల్లో సాధారణ పౌరులు, భద్రతా సిబ్బందితో సహా మొత్తం 28 మంది మరణించారని పేర్కొంది. అయితే, గతేడాదితో పోలిస్తే ఈ సంవత్సరం జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాద ఘటనలు తగ్గాయని హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ లిఖిత పూర్వక సమాధానంలో వెల్లడించారు. ఈ ఏడాది జూలై 21 వరకు మొత్తం 14 మంది భద్రతా సిబ్బంది, 14 మంది పౌరులు మరణించారు. 2023లో 46 ఉగ్రవాద ఘటనలు, 48 ఎన్‌కౌంటర్ ఘటనల్లో మొత్తం 44 మంది(30 మంది భద్రతా సిబ్బంది, 14 మంది పౌరులు) మరణించారని నిత్యానంద్ రాయ్ వివరించారు. గణాంకాల ప్రకారం, 2018లో జమ్మూకశ్మీర్ రాష్ట్రంగా ఉన్న సమయంలో 228 ఉగ్రవాద ఘటనలు, 189 ఎన్‌కౌంటర్లు జరిగాయి. అందులో 146 మంది(91 మంది భద్రతా సిబ్బంది, 55 మంది పౌరులు) మరణించారు. అదే ఏడాదిలో 1,328 రాళ్లదాడి సంఘటనలు, 52 బంద్‌లు జరిగాయని మంత్రి వివరించారు. ఇదే సమయంలో జమ్మూకశ్మీర్‌లోని ఉగ్రవాద ఘటనలు తగ్గడం ఉగ్రవాదంపై కేంద్రం అనుసరిస్తున్న 'జీరో టాలరెన్స్' విధానమే కారణమని మంత్రి తెలిపారు. ఉగ్రవాదులకు చెందిన నిధులను అరికట్టడం, టెర్రరిస్తులు, వారి అసోసియేట్లకు చెందిన ఆస్తుల జప్తు, సంఘ వ్యతిరేక సంస్థలపై నిషేధం విధించడం సహా అనేక చర్యలు ప్రభుత్వం చేపట్టిందని వెల్లడించారు.

Next Story

Most Viewed