Union Cabinet : 2 కొత్త ఎయిర్‌పోర్టులు, 3 మెట్రో రైలు ప్రాజెక్టులకు పచ్చజెండా

by Hajipasha |
Union Cabinet : 2 కొత్త ఎయిర్‌పోర్టులు, 3 మెట్రో రైలు ప్రాజెక్టులకు పచ్చజెండా
X

దిశ, నేషనల్ బ్యూరో : మూడు ప్రధానమైన మెట్రో రైలు ప్రాజెక్టులు, రెండు కొత్త ఎయిర్ పోర్టు ప్రాజెక్టులకు కేంద్ర క్యాబినెట్ శుక్రవారం పచ్చజెండా ఊపింది. ఈవివరాలను కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ మీడియాకు వెల్లడించారు. వాటి ప్రకారం.. బిహార్ రాజధాని పాట్నాలోని భిట్నా వద్ద రూ.1,413 కోట్లతో నూతన సివిల్ ఎన్‌క్లేవ్ నిర్మాణానికి ఆమోదం లభించింది. పాట్నా ఎయిర్‌పోర్టులో ఉండే రద్దీని తగ్గించేందుకు నూతన సివిల్ ఎన్‌క్లేవ్ దోహదం చేస్తుందని కేంద్రం భావిస్తోంది. దాదాపు 66వేల చదరపు మీటర్ల విస్తీర్ణంలో దీని నిర్మాణం జరగనుంది. ఏకకాలంలో 3వేల మంది ప్రయాణిలకు ఈ ఎన్‌క్లేవ్ ఆతిథ్యం ఇవ్వగలదు. ఇక బెంగాల్‌లోని బాగ్ డోగ్రా పట్టణంలోనూ కొత్త ఎయిర్ పోర్ట్ టెర్మినల్ భవనాన్ని 70,390 చదరపు మీటర్ల విస్తీర్ణంలో నిర్మించనున్నారు. దీని నిర్మాణ అంచనా వ్యయం రూ.1,549 కోట్లు.

బెంగళూరులో మూడోదశ మెట్రో రైలు ప్రాజెక్టుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందులో భాగంగా నగరంలో 2 ఎలివేటెడ్ కారిడార్ల పరిధిలో 44.65 కి.మీ పరిధిలో 31 స్టేషన్లతో మెట్రో రైలు ప్రాజెక్టు నిర్మితం అవుతుంది. మహారాష్ట్రలోని థానే నగరంలో ఇంటిగ్రల్ రింగ్ మెట్రో రైల్ ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్రం ఆమోదం లభించింది. ఇందులో భాగంగా థానే సిటీలో మొత్తం 22 స్టేషన్లతో 29 కిలోమీటర్ల మెట్రో కారిడార్‌ను నిర్మిస్తారు. దీని అంచనా వ్యయం రూ.12,200 కోట్లు. మహారాష్ట్రలోని పూణే నగరానికి మరో మెట్రో ప్రాజెక్టు మంజూరైంది. ఇందులో భాగంగా పూణేలోని స్వర్గతే నుంచి కాట్రాజ్ అండర్ గ్రౌండ్ లైన్ ఎక్స్‌టెన్షన్ వరకు మెట్రో రైలు ప్రాజెక్టును పొడిగించనున్నారు.దీని అంచనా వ్యయం రూ.2,954 కోట్లు.

Advertisement

Next Story