Trump: ట్రంప్ లిబరేషన్ డే టారీఫ్ ప్లాన్స్ గురించి వైట్ హౌజ్ ప్రకటన

by Shamantha N |
Trump: ట్రంప్ లిబరేషన్ డే టారీఫ్ ప్లాన్స్ గురించి వైట్ హౌజ్ ప్రకటన
X

దిశ, నేషనల్ బ్యూరో: అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన డొనాల్డ్ ట్రంప్(Donald Trump) టారీఫ్ లపై ప్రత్యేక దృష్టి పెట్టారు. అమెరికాపై టారీఫ్ లు విధిస్తున్న వాణిజ్య భాగస్వామ్య దేశాలపై ప్రతీకార సుంకాలకు సిద్ధమయ్యారు. దీనిపైన తుది నిర్ణయాన్ని ఏప్రిల్ 2న ట్రంప్ ప్రకటించనున్నారు. అయితే, ట్రంప్ లిబరేషన్ డే టారీఫ్ ప్లాన్స్ గురించి వైట్ హౌజ్ మీడియా కార్యదర్శి కరోలిన్ లీవిట్ స్పందించారు. అమెరికా ఉత్పత్తులపై భారత్‌ (India) 100శాతం సుంకాలు (Tariffs) వసూలు చేస్తోందని అన్నారు. ఇతర దేశాలు విధించే అధిక సుంకాల వల్ల అమెరికా (USA) ఉత్పత్తులను ఎగుమతి చేయడం అసాధ్యంగా మారుతోందని అన్నారు. అందుకే వాటిపై ప్రతీకార సుంకాలకు ఇదే సరైన సమయమని పేర్కొన్నారు. పరస్పర సుంకాలపై ఎటువంటి మినహాయింపులు ఉండవని ధ్రువీకరించారు. విదేశీ దేశాలు అమెరికన్ ఉత్పత్తులపై విధించిన సుంకాలను జాబితా చేస్తూ అన్యాయమైన వాణిజ్య పద్ధతులు నిలిపివేయాల్సిన అవసరం ఉందని చెప్పుకొచ్చారు.

చరిత్రాత్మక మార్పు..

వాణిజ్య సంబంధాల విషయంలో అమెరికా అధ్యక్షుడు చరిత్రాత్మక మార్పును తీసుకురాబోతున్నారని కరోలిన్‌ అన్నారు. అమెరికా ప్రజల క్షేమం కోరి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నారని టారీఫ్ ల నిబంధనలు ఏప్రిల్ 2 నుంచి అమల్లోకి రాబోతున్నాయని తెలిపారు. కరోలిన్ మాట్లాడుతూ..‘‘దురదృష్టవశాత్తూ కొన్ని దేశాలు చాలా కాలంగా మమ్మల్ని టారీఫ్‌ల రూపంలో పీల్చేస్తున్నాయి. అవన్నీ అన్యాయమైన వాణిజ్య విధానాలు. అమెరికా డెయిరీ ఉత్పత్తులపై ఐరోపా సమాఖ్య 50శాతం సుంకాలు వసూలు చేస్తోంది. మా బియ్యంపై జపాన్‌ 700శాతం, యూఎస్‌ వ్యవసాయ ఉత్పత్తులపై భారత్‌ 100 శాతం, మా బటర్‌, చీజ్‌పై కెనడా 300 శాతం టారిఫ్‌ వసూలు చేస్తున్నాయి. వీటి వల్ల మా ఉత్పత్తులను ఆయా మార్కెట్లకు పంపించడం అసాధ్యంగా కన్పిస్తోంది. అమెరికన్ల వ్యాపారాలు దెబ్బతింటున్నాయి. అందుకే ఆయా దేశాలపై ప్రతీకార సుంకాలు విధించేందుకు ఇదే సమయం అని భావిస్తున్నాం’’ అని ఆమె వివరించారు. అంతేకాకుండా, చరిత్రలో ఏ అమెరికన్ అధ్యక్షుడు కూడా ట్రంప్ మాదిరి విదేశీ వాణిజ్య అడ్డంకులను గుర్తించలేదని యూఎస్ వాణిజ్య ప్రతినిధి జామిసన్ గ్రీర్ ప్రకటనలో పేర్కొన్నారు. అమెరికా ఎదుర్కొంటున్న విస్తృత, హానికరమైన వాణిజ్య అడ్డంకులను తొలగించేందుకు ట్రంప్ కృషి చేస్తున్నారని అన్నారు.


👉 Read Disha Special stories


Next Story

Most Viewed