జగన్ ది జీతాలు ఇవ్వలేని అసమర్థ ప్రభుత్వం: జనసేన నేత నాదెండ్ల మనోహర్

by srinivas |   ( Updated:2021-08-13 06:39:34.0  )
nadendla
X

దిశ, ఏపీ బ్యూరో: జగన్ సర్కార్‌పై జనసేన పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వైసీపీ పార్టీ ఆర్థిక మోసాలకు తెరలేపిందని ఆరోపించారు. జీతాలు కూడా సక్రమంగా ఇవ్వని అసమర్ధ ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అని మండిపడ్డారు. ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెట్టి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో ఎక్కడా రోడ్లు కూడా వెయ్యలేదన్నారు. ఇలాంటి అసమర్థత ప్రభుత్వాన్ని తానెప్పుడూ చూడలేదన్నారు. పరిమితికి మించి రుణాలు తీసుకోవడం వల్ల రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ దివాలా తీసే పరిస్థితికి చేరిందని మండిపడ్డారు.

తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో శుక్రవారం జరిగిన జనసేన పార్టీ సమావేశంలో పాల్గొన్న నాదెండ్ల ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రూ.3వేల కోట్లతో మత్స్యకారులకు హార్బర్‌లు ఏర్పాటు చేస్తున్నామని ప్రకటించిన వైసీపీ ఇప్పటి వరకు ఆ దిశగా ప్రయత్నాలు చేయలేదన్నారు. సూట్ కేస్ కంపెనీలు నడిపిన చందంగా ముఖ్యమంత్రి జగన్ రాష్ట్రాన్ని అధోగతి పాల్జేస్తున్నారంటూ ధ్వజమెత్తారు. వైసీపీ మంత్రులకు తమ శాఖలపై పట్టులేదు..నోరు కూడా లేదని విమర్శించారు. రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా రాజకీయ సలహా దారులపై నడుపుతూ వ్యవస్థకు తూట్లు పొడుస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ ప్రజల జీవనాడి పోలవరంపై అసత్య ప్రచారం చేస్తున్నారంటూ విరుచుకుపడ్డారు.

ప్రభుత్వ వైఖరి వల్ల కొత్త కంపెనీలు రావడం లేదన్నారు. ఉన్న కంపెనీలు రాష్ట్రాన్ని వదిలి పోతున్నాయని ఆరోపించారు. ప్రతీరోజూ రూ.830 కోట్లు ఖర్చు పెడుతున్నామని చెప్తున్నారని మరి ఆ డబ్బు ఎక్కడకు పోతుందని ప్రశ్నించారు. మరోవైపు జనసేన పార్టీ బలోపేతం కోసం ప్రతీ కార్యకర్త కృషి చేయాలన్నారు. క్షేత్ర స్థాయిలో మండలాల వారిగా పార్టీని బలోపేతం చేసేందుకు సామాన్యులకు సైతం అవకాశం కల్పిస్తున్నామని నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఈ సందర్భంగా ఇటీవల మరణించిన జనసేన పార్టీ కార్యకర్తల కుటుంబాలకు రూ.5 లక్షల చెక్‌లను అందజేశారు. ఈ కార్యక్రమంలో తూర్పుగోదావరి జిల్లా జనసేన అధ్యక్షుడు కందుల లక్ష్మీదుర్గేశ్‌తో పాటు ఇతర నాయకులు పాల్గొన్నారు.

👉 Download Dishadaily Android App
👉 Download Dishadaily IOS App
👉 Follow us on whatsApp channel
👉 Follow us on Share chat

Next Story

Most Viewed