హోం మంత్రి పదవికి ఎసరు… ఢిల్లీకి డిప్యూటీ సీఎం

by Shamantha N |   ( Updated:2021-03-21 01:47:23.0  )
హోం మంత్రి పదవికి ఎసరు… ఢిల్లీకి డిప్యూటీ సీఎం
X

ముంబయి: హోం మంత్రి అనిల్ దేశ్‌ముఖ్ పై మాజీ పోలీస్ కమిషనర్ పరమ్ బీర్ సింగ్ సంచలన ఆరోపణలు చేస్తూ సీఎం ఉద్దవ్ థాక్రేకు రాసిన లేఖ మహారాష్ట్ర రాజకీయాల్లో దుమారం రేపుతోంది. ఆరోపణల నేపథ్యంలో హోం మంత్రి రాజీనామా చేయాల్సిందేనంటూ ప్రభుత్వంపై బీజేపీ ఒత్తిడి పెంచింది. ఈ నేపథ్యంలో ఆయన పదవికి ఎసరు వచ్చినట్టు తెలుస్తోంది.

హోం మంత్రిపై తీవ్ర ఆరోపణల నేపథ్యంలో అనిల్ పై వేటు పడే అవకాశం ఉందని మహావికాస్ అగాఢీ ప్రభుత్వానికి చెందిన నేత ఒకరు తెలిపారు. ఇప్పటికే ఈ విషయంలో హోం మంత్రి, ఎన్సీపీ నేత అనిల్ తీరుపై ఆ పార్టీ చీఫ్ శరద్ పవార్‌కు మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ థాక్రే ఫోన్ చేసి సీరియస్ అయినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అనిల్ విషయంపై చర్చించడానికి ఢిల్లీకి రావాలంటూ మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్, మహారాష్ట్ర క్యాబినెట్ మంత్రి జయంత్ పాటిల్‌లను ఆ పార్టీ అధినేత శరద్ పవార్ ఆదేశించినట్టు తెలుస్తోంది.

కాగా శివసేన ఎంపీ సంజయ్ రౌత్ కూడా ఆదివారం ఢిల్లీ వెళ్లనున్నారు. ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. హోం మంత్రిపై ఇలాంటి ఆరోపణలు రావడం షాకింగ్‌గా ఉందన్నారు. ఈ విషయంలో పూర్తిస్థాయిలో విచారణ జరగాలన్నారు. నిర్ణయాలు తీసుకోవడంలో ఎన్సీపీ నేత శరద్ పవార్ సమర్థుడని ఆయన చెప్పారు. తాను డిల్లీకి వెళుతున్నానని రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులపై శరద్ పవార్‌తో చర్చించనున్నట్టు చెప్పారు.

ఇక పరంబీర్ సింగ్ మంచి పోలీస్ ఆఫీసర్ అని రౌత్ అన్నారు. ఆయన గురించి వ్యక్తిగతంగా ఎలాంటి కామెంట్లు చేయదలుచుకోలేదని తెలిపారు. ఇప్పటి వరకు ఆయన మంచి సేవలు అందించాడని అన్నారు. కానీ లేఖ ఆయనే రాశాడా లేదా అన్న విషయంతో పాటు ఆ లేఖలో రాసిన అంశాలపై కూడా పూర్తి స్థాయిలో విచారణ జరగాలన్నారు. కాగా ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్‌తో సీఎం ఉద్దవ్ థాక్రే ఆదివారం సాయంత్రం భేటీ అయ్యే అవకాశం ఉన్నట్టు సమాచారం. తాజా పరిస్థితుల నేపథ్యంలో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలని ఇద్దరు కలిసి నిర్ణయిస్తారని తెలుస్తోంది. అయితే అనిల్ పై వేటు వేసే అవకాశాలే ఎక్కువగా ఉన్నట్టు అగాఢీ నేతలు చెబుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed